● కేఎంసీ ఉద్యోగుల సమయపాలనపై దృష్టి ● అధికారులు, ఉద్యోగులకు గుర్తింపు కార్డులు కూడా..
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ(కేఎంసీ) కార్యాలయంలో పరిపాలన మరింత పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు అందించడంపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించేలా పర్యవేక్షించడాన్ని ప్రథమ ప్రాధాన్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిర్యాదులు, వినతులు ఇచ్చేందుకు ప్రజలు వస్తుండగా, ఇంకొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇష్టారాజ్యంగా వచ్చివెళ్తుండడంతో ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఎప్పుడొస్తున్నారు ?
కేఎంసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఎస్టాబ్లిస్‌మెంట్, అకౌంట్స్, శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించి రెగ్యులర్ ఉద్యోగులు 250 మంది వరకు ఉండగా.. వీరిలో 120 మంది వరకు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది 1,100 మందికి గాను 100 మంది వరకు కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే, ఇందులో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కార్యాలయంలో విధులు నిర్వర్తించే అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి, ఆన్‌లైన్‌లో హాజరు నమోదుకు కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే సెల్‌ఫోన్ సాయంతో లొకేషన్ ఆధారంగా హాజరు నమోదుకు ఏర్పాట్లు మొదలైనట్లు సమాచారం.
భోజనం ఇక్కడే..
కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులంతా కేఎంసీలోనే భోజనం చేయాలని కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భోజనం పేరిట పలువురు బయటకు గంటల తరబడి సమయం వృధా చేస్తున్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈమేరకు మధ్యాహ్నం 1–30 నుండి 2గంటల వరకు విరామ సమయంలో కార్యాలయ మూడో అంస్తులోని డైనింగ్ హాల్‌లో భోజనం చేయాలని సూచించారు. ఇక కార్యాలయానికి ఎవరెవరు, ఏయే పనులపై వస్తున్నారో నమోదుకు కొత్తగా రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయ ప్రవేశం వద్దే ఈ కౌంటర్ ఏర్పాటుచేసి ఉద్యోగిని నియమిస్తారు. తద్వారా ఎవరు, ఏ పనిపై వచ్చారో నమోదు చేసుకుని స్లిప్ జారీ చేసి ఆ విభాగంలోకే వెళ్లేలా పర్యవేక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment