కన్నీరు ఇంకిపోతోంది..
జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టులోనూ బోర్లు, బావులు, చెరువుల కింద సాగు చేసిన వరి, మొక్కజొన్న, ఇతర పంటలు ఎండిపోతున్నాయి. యాసంగిలో అన్నీ కలిపి 2,93,991 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇందులో వరి, మొక్కజొన్న అత్యధికంగా ఉన్నాయి. నాన్ ఆయకట్టులో బోర్లు, బావుల్లో నీళ్లు ఇంకిపోవడమే కాక చెరువుల్లో నీటి మట్టం తగ్గింది. అలాగే, వారబందీ విధానంతో సాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. అటు కాల్వలు, బావులు, బోర్లలోనే కాక కళ్లలోనూ ఇంకిపోయిన నీటితో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఈమేరకు అన్నదాతల ఆవేదన, పంటల పరిస్థితిపై బుధవారం ‘సాక్షి’ చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలతో కథనం... – సాక్షి ప్రతినిధి, ఖమ్మం / నెట్‌వర్క్
ఈ కుటుంబానికి దిక్కెవరు?
చింతకాని మండలం లచ్చగూడెంకు చెందిన నెర్సుల ఎల్లయ్య పదిహేనేళ్ల పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల ఆరోగ్యం సహకరించక గ్రామంలోనే మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. సాగర్ ఆయకట్టు చివరి భూమి కావడం, బావిలోనూ నీళ్లు అడుగంటడంతో నీరు అందించలేని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే రూ.60 వేలు పెట్టుబడి పెట్టిన ఆయన కళ్ల ముందే పంట ఎండిపోతుండడంతో మంగళవారం పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమకు దిక్కెవరని రోదిస్తున్న ఆయన భార్య నర్సమ్మ, ఇద్దరు ఆడపిల్లలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు.
చివరి ఆయకట్టు చింత
సాగర్ ఆయకట్టు 2.54 లక్షల ఎకరాలు కాగా.. కాల్వల ఆధారంగా లిఫ్ట్ ఇరిగేషన్లతో కలిపి 2.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖమ్మం, వైరా, మధిర, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాలకు సాగర్ జలాలు సరఫరా అవుతుండడంతో వరి, మొక్కజొన్నతోపాటు ఆరుతడి పంటలను సాగు చేశారు. ఇందులో మొక్కజొన్న పంట కంకి దశలో ఉండగా నీటి తడులు ఎక్కువగా అవసరమవుతున్నాయి. కానీ సాగర్ జలాలను వారబందీ విధానంలో గత ఏడాది డిసెంబర్ 15 నుంచి విడుదల చేస్తున్నారు. మొదటి తడి 27 రోజులు ఇచ్చి తొమ్మిది రోజులు నిలిపేశారు. ఆపై రెండో తడి నుంచి తొమ్మిది రోజులు ఆన్, ఆరు రోజులు ఆఫ్ విధానం అమలవుతోంది. ఈ విధానంతో కొన్ని మండలాలకు నీరు అంది.. ఆపై నిలిచిపోవడంతో చివరి ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వారబందీ విధానం తొలగించి కనీసం రెండు నెలలపాటు సక్రమంగా సరఫరా చేయాలని ఇటీవల బోనకల్ మండల రైతులు కలెక్టర్‌ను కలిసి అభ్యర్థించారు.
అడుగంటిన భూగర్భ జలాలు
యాసంగిలో రైతులు సాగర్ జలాలతోపాటు బోర్లు, బావులను నమ్ముకోగా భూగర్భ జలాలు సైతం పడిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది డిసెంబర్‌లో భూగర్భ జలాలు 3.87 మీటర్ల లోతులో ఉంటే.. ఈ ఏడాది జనవరిలో 4.49 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఫిబ్రవరిలో ఎండలు పెరగగా నీటిమట్టం మరింత పడిపోయి బోర్లు, బావుల్లో కూడా నీళ్లు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు తగ్గగా పలువురు 5 హెచ్‌పీ మోటార్లు తీసేసి 3 హెచ్‌పీ మోటార్లను బిగించి వచ్చే అరకొర నీటిని పంటలకు పెడుతున్నారు.
కళ్ల ముందే ఎండుతున్న పంటలు
బోనకల్ మండలంలో ఎక్కువగా సాగర్ జలాలపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్(బీబీసీ) పరిధి ఆళ్లపాడు, నారాయణపురం, కలకోట, రాపల్లి, గోవిందపురం, రాయన్నపేట తదితర గ్రామాల్లో ఆరు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా వారబందీ విధానంతో చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. కొందరు రైతులు సమీపంలోని చెరువులు, వాగుల నుండి తాత్కాలికంగా నీటిని పెట్టుకుంటున్నారు. అలాంటి వసతి లేనివారు కళ్ల ముందే పంట ఎండిపోతున్నా కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. బీబీసీ పరిధిలో 11 మైనర్ కాల్వలు ఉండగా, ఇక్కడి నుంచే ఏపీకి జలాలు వెళ్లాలి. కానీ చింతకాని మండలం, బోనకల్ మండలంలోని కొన్ని గ్రామాలకు నీరు చేరగానే నిలిచిపోతుండడంతో చివరి ఆయకట్టు ఎండిపోతోంది. ఇక తల్లాడ మండలంలోని సిరిపురం మేజర్ పరిధి తెలగవరం, తల్లాడ మైనర్ల కింద ఉన్న ఆయకట్టుకు నీరు అందడం లేదు. పుణ్యపురం మేజర్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. వైరా మండలం అష్ణగుర్తిలో రాపల్లి మేజర్ కాల్వ పదో కి.మీ. పరిధిలో నీరు అందక మొక్కజొన్న పంట నిలువునా ఎండిపోతోంది.
ఏపీ నుంచి నీటి కొనుగోలు
మధిర మండలం నిదానపురం మేజర్ కింద ఖమ్మంపాడుకు చెందిన గుమ్మా రవి ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. సాగర్ జలాలు అందుతాయని ఆశించి ఎకరాకు రూ.10వేల చొప్పున కౌలు చెల్లించాడు. రెండుసార్లు మాత్రమే సాగర్‌నీరు అందగా.. ఇప్పుడు తోట ఎండిపోతుండటంతో ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వి.అన్నవరంలోని లిఫ్ట్ నుంచి నీరు కొనుగోలు చేశాడు. ఒక్కో తడికి ఎకరాకు రూ.2వేలు చెల్లిస్తున్నానని రవి తెలిపాడు.
జిల్లాలో సాగునీటికి కటకట
చివరి ఆయకట్టుకు అందని
సాగర్ జలాలు
వారబందీ విధానంతో
రైతుల ఆందోళన
బోర్లు, బావుల్లోనూ అడుగంటుతున్న భూగర్భ జలాలతో పంటల ఎండుముఖం
పంట చేతికందేలా లేదు..
ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల ఫకీరు ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. మున్నేరు సమీపంలో ఉన్నా బావిలో నీరు లేక ఇబ్బంది పడుతున్నాడు. కౌలు కింద 48 బస్తాలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే పెట్టుబడిగా రూ.1.20 లక్షలు వెచ్చించాడు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట చేతికందడం కష్టమేనని చెబుతున్నాడు. ఎర్రుపాలెం మండలం మూమునూరులో కట్లేరుకు వచ్చే సాగర్ జలాలను నమ్ముకుని వరి, మొక్కజొన్న సాగు చేసినా నీళ్లు అందక పంటలు ఎండుతున్నాయి.
వరి వదిలి.. మామిడి సాగు..
తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన కొమ్మినేని రాంబాబు మూడేళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. అయితే సాగర్ నీరందక నష్టం ఎదురవుతుండడంతో ఈసారి వరి మానేసి రెండెకరాల్లో మామిడి మొక్కలు నాటాడు. మామిడి దిగుబడి మూడేళ్లు దాటితే కానీ రాదు. దీంతో ఆదాయం కోల్పోతున్నా చేసేదేం లేదని చెబుతున్నాడు.
మిర్చికి అరకొరగానే..
కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన సామినేని వెంకటేశ్వర్లు ఐదెకరాల భూమిలో రెండు బోర్లు వేయించాడు. గతంలో మోటార్ల నుంచి 3 ఇంచుల మేర నీరు రావడంతో యాసంగిలో మిర్చి, పత్తి, మొక్కజొన్న వేశాడు. డిసెంబర్ నుంచి బోర్లలో నీరు తగ్గి కేవలం ఇంచు ధార మాత్రమే వస్తోంది. చేసేదేం లేక రెండున్నర ఎకరాల మొక్కజొన్న చొప్పను గొర్రెల మేతగా రూ.13 వేలకు విక్రయించాడు. పంటసాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. ఇక బోర్లలో నీరు తగ్గగా 5హెచ్‌పీ మోటార్లు తీసేసి 3హెచ్‌పీ మోటార్లు బిగించి వస్తున్న అరకొర నీటిని మిరప పంటకు అందిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ధనియాకుల హన్మంతరావు రెండెకరాల్లో మిర్చి సాగు చేశాడు. బోరును నమ్ముకొని సాగు చేస్తే వారం రోజులుగా నీళ్లు ఇంకుతున్నాయి. దీంతో కొత్తగా మూడు బోర్లు వేయిస్తే చుక్కనీరు పడకపోగా రూ.లక్ష వరకు ఖర్చయింది.
కన్నీరు ఇంకిపోతోంది..
కన్నీరు ఇంకిపోతోంది..
కన్నీరు ఇంకిపోతోంది..
కన్నీరు ఇంకిపోతోంది..
కన్నీరు ఇంకిపోతోంది..
కన్నీరు ఇంకిపోతోంది..
కన్నీరు ఇంకిపోతోంది..
కన్నీరు ఇంకిపోతోంది..
Comments
Please login to add a commentAdd a comment