● బకాయిలపై సభ్యులకు బ్యాంకర్ల నుండి నోటీసులు ● ఆర్పీ పక్కదారి పట్టించడమే కారణం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. పట్టణాల్లో సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యాన ఈ రుణాలు మంజూరు చేయిస్తుంటారు. ఇదంతా టీఎల్‌ఎఫ్, సీఓ, ఆర్పీల పర్యవేక్షణలో కొనసాగుతుండగా కొందరు ఆర్పీలు సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నగదు స్వాహా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఓ ఆర్పీ.. సభ్యులకు మంజూరైన రుణాన్ని తీసుకుని తిరిగి కట్టకపోవడంతో సభ్యులకు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి.
వరుస నోటీసులతో...
ప్రకాశ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరు మహిళా సంఘాలకు 2021–22 ఏడాదిలో రూ.2 కోట్లకు పైగా రుణాలను బ్యాంక్ లింకేజి, సీ్త్రనిధి ద్వారా ఆర్పీ మంజూరు చేయించారు. ఈ సమయాన ఒక సీఓ సంతకం చేసినా మరొకరి సంతకాన్ని ఆర్పీ ఫోర్జరీ చేసినట్లు సమాచారం అంతేకాక 40 మంది సభ్యుల ఖాతాల్లో జమ అయిన కొంత మొత్తాన్ని ఆమె తీసుకున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక సభ్యులు తాము రుణాలు సకాలంలో చెల్లించినా, ఆర్పీ నగదు తరిగి కట్టకపోవడంతో బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా బ్యాంకర్లు ఆర్పీ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండడం గమనార్హం. సుమారు రూ.1.50 కోట్ల మేర ఆర్పీ తీసుకున్నట్లు తెలుస్తుండగా, నోటీసులకు స్పందించని కారణంగా సభ్యులతో పాటు ఆర్పీ ఖాతాను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు తెలిసింది.
‘వన్ టైం’ కోసం..
ఖమ్మం పరిధిలోని మెప్మా ద్వారా మంజూరు చేయించే రుణాల చెల్లింపులో ఆర్పీలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. సభ్యులకు మంజూరయ్యే రుణాలు ఆర్పీలు తీసుకుని తామే చెల్లిస్తామని నమ్మబలకడం, ఆ తర్వాత సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈక్రమంలోనే ఖాతాలను బ్లాక్‌లో పెడుతున్న బ్యాంకర్లు కొన్నాళ్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం ఇస్తున్నారు. దీంతో ఎంతోకొంత చెల్లించి ఆర్పీలు సెటిల్ చేస్తున్నారని సమాచారం. ఇదేమాదిరి ప్రకాశ్‌నగర్ ప్రాంత ఆర్పీ కూడా వ్యవహరించగా, ఇందులో సీఓల పాత్ర కూడా ఉందని తెలిసింది. ఈఅంశంపై మెప్మా అధికారులను వివరణ కోరగా.. బ్యాంకర్లు రుణాలను సభ్యుల ఖాతాల్లో జమ చేశారని తెలి పారు. అప్పుడు ఒక సీఓ సంతకాన్ని ఆర్పీ ఫోర్జరీ చేసినట్లు తేలగా ఆమెను విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment