పాల్వంచరూరల్: పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్య అందనుంది. ఇందుకోసం కంప్యూటర్లను కేటాయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 46 స్కూళ్లకు డెస్క్ టాప్ కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు మంజూరయ్యాయి. అలాగే, రెండు జిల్లాల్లో ఏడు ఎమ్మార్సీలకు సైతం కంప్యూటర్లు కేటాయించారు. వీటితో విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, గతంలోనూ పాఠశాలలకు కంప్యూటర్లు కేటాయించినా శిక్షకులను నియమించకపోవడంతో అవి అటకెక్కాయి. ప్రస్తుతం కూడా బోధకులను కేటాయించకపోతే అదే పరిస్థితి ఎదురవుతుందని పలువురు చెబుతున్నారు.
పాఠశాలల వివరాలిలా..
పీఎంశ్రీ పథకం ద్వారా భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల బాలికల టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌కు పది కంప్యూటర్లు, ఒక ప్రింటర్, రెండు యూపీఎస్‌లు కేటాయించారు. అలాగే, టేకులపల్లి మండలం కొయ్యగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, జూలూరుపాడు మండలం పాపకొల్లులోని జెడ్పీహెచ్‌ఎస్, అన్నపురెడ్డిపల్లిలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, చుంచుపల్లి మండలం బాబుక్యాంప్‌లోని హైస్కూల్, కొత్తగూడెం కూలీలైన్ హైస్కూల్, లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం జెడ్పీహెచ్‌ఎస్, పాల్వంచలోని బాలుర టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, బాలికల జెడ్పీహెచ్‌ఎస్, బూర్గంపాడు మండలం సారపాకలోని జెడ్పీహెచ్‌ఎస్, భద్రాచలంలోని కొర్రాజులగుట్ట జెడ్పీహెచ్‌ఎస్, ములకలపల్లిలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, దమ్మపేటలోని టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, పినపాక మండలం అల్చిరెడ్డిపల్లిలోని ఆశ్రమ పాఠశాల, దుమ్ముగూడెం మండలం రేగుబల్లిలోని బాలికల ఆశ్రమ పాఠశాలకు కంప్యూటర్లు, ఇతర సామగ్రి మంజూరయ్యాయి.
అలాగే, అశ్వాపురం జెడ్పీహెచ్‌ఎస్, మణుగూరులోని బాలికల టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ, గుండాల మండలంలోని టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, సుజాతనగర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్, దమ్మపేటలోని జెడ్పీహెచ్‌ఎస్, దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గిరిజన అశ్రమ పాఠశాలలకు కూడా కేటాయించారు. వీటితో పాటు ఖమ్మం జిల్లాలోని 25 స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు మంజూరయ్యాయి. ఇవి ప్రస్తుతం మండల వనరుల కేంద్రాలకు చేరగా, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇక భద్రాద్రి జిల్లాలోని అళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లితో పాటు ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మార్సీకి సైతం ఆరేసి కంప్యూటర్లు, ఒక ప్రింటర్, ఒక యూపీఎస్ మంజూరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment