బోనకల్: మండలంలోని రావినూతలలో బస్ డ్రైవర్, కండక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుబాబు తెలిపారు. ఈనెల 16న ఖమ్మం డిపో బస్సు బోనకల్ మండలం లక్ష్మీపురం వెళ్లి వస్తుండగా ఓ సైక్లిస్ట్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్ దెబ్బతినగా డ్రైవర్ షేక్ మస్తాన్ బాధితుడికి పరిహారంగా రూ.వెయ్యి ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇక 18వ తేదీన బస్సులో డ్రైవర్ మస్తానే ఉండగా రావినూతల జీపీ సమీపాన మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, షేక్ నాగుల్‌మీరా అడ్డుకుని ఆయనను కిందకు దించి సైకిల్ విషయమై ప్రశ్నించే క్రమాన అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్ సంధ్యారాణి సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కున్నారు. ఘటనపై కండక్టర్ ఫిర్యాదుతో ఉపేందర్, నాగుల్‌మీరాపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోక్సో కేసు నమోదు
రఘునాథపాలెం: బాలికను కిడ్నాప్ చేసినట్లు అందిన ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌షరీఫ్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు కిడ్నాప్ చేసినట్లు ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను గుర్తించి ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా కిడ్నాప్ కేసును పోక్సో కేసుగా మార్చినట్లు సీఐ వెల్లడించారు.
బెల్ట్‌షాపు నిర్వాహకుల బైండోవర్
తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న 30మందిని గురువారం ఎకై ్సజ్ పోలీసులు బైండోవర్ చేశారు. ఈమేరకు తహసీల్దార్ పీ.వీ.రామకృష్ణ ఎదుట వారిని హాజరుపర్చగా రూ.2లక్షల పూచీకత్తు తీసుకున్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మితే ఏడాది జైలు లేదా రూ.2లక్షల జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
భర్త చేతిలో భార్య హతం
వలస కూలీ కుటుంబంలో విషాదం
కారేపల్లి: మధ్యప్రదేశ్ నుంచి మిర్చి కోతలకు వచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది. ఓ కుటుంబంలో జరిగిన ఘర్షణతో భార్య కడుపులో భర్త బలంగా కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారేపల్లి ఎస్సై ఎన్.రాజారాం తెలిపిన వివరాలు... మధ్యప్రదేశ్ రాష్ట్రం దుండూరి జిల్లా గాయత్రి మందిర్ గ్రామానికి చెందిన పలువురు మిర్చి కోతల కోసం వచ్చారు. కారేపల్లి మండలం జైత్రాంతండా శివారులో డేరాలు వేసుకుని ఉంటుండగా, ఇందులోని భార్యాభర్తలు మరవి పింకీ(40), కమలేష్ మధ్య బుధవారం ఉదయం గొడవ జరిగింది. ఈక్రమాన మాటామాటా పెరగడంతో కమలేష్ తన భార్య పింకీ కడుపులో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని నిందితుడు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం
అశ్వారావుపేటరూరల్: ఓ చిన్నారి మృతిపై ఆలస్యంగా అందిన ఫిర్యాదుతో ఖననం చేసిన మృతదేహాన్ని గురువారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై టి.యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురానికి చెందిన నారదాసు రామకృష్ణ, వరలక్ష్మి దంపతుల నాలుగు నెలల చిన్నారికి ఈనెల 5న అశ్వారావుపేటలోని సబ్ సెంటర్‌లో టీకా వేయించగా 6న మధ్యాహ్నం మృతి చెందింది. అదేరోజు చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు రామకృష్ణ బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment