ఎల్‌ఆర్‌ఎస్ అనేనా?!
ఈసారైనా
మున్సిపాలిటీల్లోనూ ముందుకు పడలే..
ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఖమ్మం కార్పొరేషన్, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లో 51,425 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 8,851 అనుమతి పొందగా.. 339 దరఖాస్తులను తిరస్కరించారు. గతంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నవి 53 ఉండగా, సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా 2,035 దరఖాస్తులను పక్కన పెట్టారు. అలాగే, నిషేధిత సర్వేనంబర్లలోనివి 5,946 ఉన్నాయి. కాగా, మూడు దశల్లో భాగంగా ఎల్–1లో 33,302, ఎల్–2లో 259, ఎల్–3 దశకు 51 దరఖాస్తులు చేరాయి. మున్సిపాలిటీల్లో ఫీజు చెల్లింపునకు 8,851 దరఖాస్తులు అనుమతి పొందినా 1,146 దరఖాస్తులకే ఫీజు చెల్లించారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే మున్సిపాలిటీల్లో దరఖాస్తుల పరిశీలన, ఫీజు చెల్లింపు ప్రక్రియ ముందుకు పడడడం లేదని స్పష్టమవుతోంది.
సుడా, జీపీల్లో ఎక్కడివి అక్కడే..
దరఖాస్తుల పరిశీలనలో సుడా, గ్రామపంచాయతీలు పూర్తిగా వెనుకబడ్డాయి. సుడా(స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలో 34,391 దరఖాస్తులు వస్తే ఇందులో కేవలం ఏడు మాత్రమే అనుమతి పొందగా.. 853 దరఖాస్తులను నిషేధిత జాబితాలో పెట్టారు. ఇక అనుమతి లభించిన ఏడింట్లో నాలుగింటికే ఫీజు చెల్లింపు పూర్తయింది. గ్రామపంచాయతీల్లో 13,931 దరఖాస్తులు అందగా 58 దరఖాస్తులకు అనుమతి ఇస్తే ఒక దరఖాస్తుకే ఫీజు చెల్లించారు. మరో 571 దరఖాస్తులను నిషేధిత జాబితాలో పెట్టగా, 13,235 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఒక్కో దశ దాటితేనే..
తొలుత సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆపై మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో రెవెన్యూ గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన బృందం పరిశీలన చేపట్టాలి. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంది. అదే సమయాన భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, హెరిటేజ్ భవనాలు, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలో లేవని ధ్రువీకరించాలి. ఇదంతా మూడు దశల్లో జరగాల్సి ఉన్నా చాలా సమయం పడుతోంది.
ఊరటనిచ్చేలా రాయితీ
ఏళ్లుగా పెండింగ్ ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ దరఖాస్తుదారులకు కలిసొస్తుంది. ఒక ప్లాట్‌కు సంబంధించి రోడ్లు, పైపులైన్లు, ఇతర సౌకర్యాలు లేకుండా ఏర్పాటుచేసినందుకు ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు విధిస్తుంటారు. వీటితోపాటు గ్రీన్‌ల్యాండ్‌కు 10 శాతం స్థలాన్ని ఇవ్వనందుకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం విలువను లెక్కించి దానిపై 14 శాతం చార్జీ విధిస్తారు. ఈ రెండూ చెల్లిస్తేనే యజమానికి స్థలం రెగ్యులరైజ్ అవుతుంది. మొత్తంగా రాయితీతో దరఖాస్తుదారులకు ముందుకొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇదే సమయాన అదనపు సిబ్బందిని కేటాయించాలనే సూచనలు వస్తున్నాయి.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు
మున్సిపాలిటీలు దరఖాస్తులు అనుమతి ఫీజు చెల్లింపు
ఖమ్మం కార్పొరేషన్ 39,942 3,735 939
మధిర మున్సిపాలిటీ 4,276 1,488 97
సత్తుపల్లి మున్సిపాలిటీ 3,688 2,391 62
వైరా మున్సిపాలిటీ 3,516 1,237 48
సుడా పరిధి 34,391 07 04
గ్రామపంచాయతీలు 13,931 58 01
మొత్తం 99,747 8,916 1,151
పరిశీలనే అసలు సమస్య
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన యంత్రాంగానికి సవాల్‌గా మారింది. మున్సిపాలిటీల్లో దరఖాస్తుల పరిశీలన ఒకింత నత్తనడకన సాగుతున్నా.. సుడా, గ్రామపంచాయతీల్లో మాత్రం పూర్తిగా పడకేసింది. సుడాకు క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొనగా, జీపీల్లో కార్యదర్శులు, ఆ తర్వాత మండల స్థాయిలో జరగాల్సిన పరిశీలన కూడా మందగించింది. ఈసారి ప్రభుత్వం ఫీజులో రాయితీ ప్రకటించి,మార్చి 31వరకు గడువు విధించిన నేపథ్యాన పరిశీలనకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తేనే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.
జిల్లాలో 99,747ఎల్‌ఆర్‌ఎస్
దరఖాస్తుల్లో 8,916కే అనుమతి
సిబ్బంది కొరతతో
ఏళ్లుగా నత్తనడకన పరిశీలన
తాజాగా రాయితీ ప్రకటించిన ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment