అనుమతి.. మాకు అవసరం లేదు!
ఖమ్మం ఇందిరానగర్ ప్రాంతంలో ఓ భవన యజమాని సెల్లార్‌తో పాటు రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకున్నాడు. ఆతర్వాత సెట్ బ్యాక్ కాకుండానే అనుమతికి మించి రెండు ఫ్లోర్లు అదనంగా నిర్మించాడు. స్లాబ్‌ల నిర్మాణం పూర్తయ్యాక కేఎంసీ అధికారులు పనులను అడ్డుకున్నారు. అదనపు నిర్మాణాలకు అనుమతి తీసుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఇలా ఖమ్మంలో మాత్రమే కాదు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ పలువురు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.
●కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ●అనుమతి తీసుకున్నా అంతకు మించి కట్టడాలు ●అయినా చోద్యం చూస్తున్న అధికారులు ●ఫిర్యాదులు అందితే నోటీసులతోనే సరి
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో ప్రధాన నగరాల తర్వాత అత్యధిక జనాభా నివసించే నగరంగా ఖమ్మం నిలుస్తోంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వస్తున్న వారితో జిల్లాలోని ఖమ్మంతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లోనూ జనాభా.. అందుకు అనుగుణంగా నిర్మాణాల సంఖ్య పెరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఖమ్మం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో నిబంధనలను బేఖాతరు చేస్తూ చేపడుతున్న నిర్మాణాలతో భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. కొందరు పూర్తిగా అనుమతులు తీసుకోకపోగా.. ఇంకొందరు గ్రౌండ్ ఫ్లోర్ వరకే అనుమతి తీసుకుని ఆపై రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపడుతుండడం గమనార్హం.
విద్యుత్ కనెక్షన్లు, ఇంటి నంబర్లు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు. పాలకులు సీరియస్‌గా తీసుకున్నా.. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా వాణిజ్య, నివాస ప్రాంతాల్లో నిర్మాణాల సంఖ్య రెట్టింపు స్థాయికి చేరింది. ఎక్కడ చూసినా మూడు నుండి ఐదు అంతస్తుల భవనాలే కనిపిస్తున్నాయి. ఇక వాణిజ్య ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 168 జీఓ ప్రకారం అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని మున్సిపల్ చట్టం చెబుతున్నా యజమానులు పట్టించుకోవడం లేదు. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు అటు విద్యుత్ అధికారులు కనెక్షన్లు ఇస్తుండగా.. రెవెన్యూ విభాగ అధికారులు నంబర్లను కేటాయిస్తుండడం గమనార్హం.
కనిపించడం లేదా?
వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా చేపడుతున్న నిర్మాణాలు, పార్కింగ్ సౌకర్యం కూడా లేదని తెలిసినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పరిశీలిస్తే బైపాస్ రోడ్డు, బస్టాండ్లు, పాఠశాలలు, మార్కెట్ల వద్ద ఒకటి, రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని, ఆపైన అదనపు నిర్మాణాలు చేపడుతున్నారు. కనీసం పార్కింగ్ సౌకర్యం లేకుండా సెల్లార్‌లో సైతం నిర్మాణాలు చేపడుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
సెట్ బ్యాక్ లేకుండానే..
చాలాచోట్ల కనీసం సెట్‌బ్యాక్ కూడా లేకుండా నిర్మాణాలు చేపడుతుండడంతో ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెట్‌బ్యాక్ లేకుండా భవనాలు నిర్మిస్తున్నట్లు వందల సంఖ్యలో కేఎంసీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పు ఆధారంగా సెట్ బ్యాక్ కావాలి. నలభై అడుగుల లోపు వెడల్పు రోడ్డు పక్కన 240 గజాల స్థలంలో చేపట్టే నిర్మాణాలకు ముందు భాగాన కనీసం ఐదు అడుగులు సెట్‌బ్యాక్ కింద వదలాలి, ఇక మిగిలిన మూడు వైపులా మూడు అడుగులకు పైగా సెట్ బ్యాక్ వదలాలి. అలాగే, వంద అడుగుల రోడ్డు పక్కన 400 – 500 గజాల్లోపు స్థలంలో నిర్మించే భవనాలైతే ముందు భాగంలో 20 అడుగుల సెట్‌బ్యాక్ వదలాల్సి ఉన్నా ఎవరూ పాటించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment