విద్యార్థులపై ప్రత్యేక ‘దృష్టి’
● గతంలోనే కంటి సమస్యలు ఉన్న వారి గుర్తింపు ● 3,557 మందికి నిపుణులతో మరోమారు పరీక్షలు ● అవసరమైన వారికి అద్దాల పంపిణీ
సత్తుపల్లి టౌన్: తరగతి గదిలో బోర్డు సరిగ్గా కనిపించకపోవడం, పోషకాహార లోపంతో ఎదురవుతున్న కంటి సమస్యలు, కళ్ల మంటలు, తలనొప్పి, ఎక్కువ సేపు చదవలేకపోవడం... వంటి సమస్యలతో పలువురు విద్యార్థులు సతమతమవుతున్నారు. పిల్లలు ఎక్కువసేపు సెల్‌ఫోన్లు, టీవీ చూస్తుండడంతో ఇలా జరుగుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యాన ప్రభుత్వం రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద ఇప్పటికే రెండు విడతలుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే 1,11,557 మంది విద్యార్థులకు 12 వైద్య బృందాలతో కొన్నాళ్ల క్రితం కంటి పరీక్షలు చేయించింది. వీరిలో 3,557 మంది విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది.
మూడో విడత నిపుణులతో..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో 5నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు తొలి రెండు దశల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులకు ఈనెల 17నుంచి నిపుణులతో పరీక్షలు చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, నేలకొండపల్లి ఏరియా ఆస్పత్రుల్లో కంటి వైద్య నిపుణులతో నిర్వహిస్తున్న పరీక్షలు వచ్చేనెల 15వ తేదీ వరకు కొనసాగుతాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున విద్యార్థులకు పరీక్షలు చేయించేలా కార్యాచరణ రూపొందించారు. ఆపై కంటి శుక్లాలు, కంటి చూపు సమస్యలను నిర్ధారించి దృష్టి లోపం ఉన్న వారికి కంటి అద్దాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, విద్యార్థులను ఆస్పత్రులకు తీసుకొచ్చి, తిరిగి తీసుకెళ్లడానికి ఆర్‌బీఎస్‌కే వాహనాలను వినియోగిస్తున్నారు.
ప్రాథమిక పరీక్షలు 1.11 లక్షల మందికి..
పరీక్షలు చేసిన వైద్యబృందాలు 12
దృష్టి లోపం ఉన్న విద్యార్థులు 3,557
స్క్రీనింగ్ చేసే ఆస్పత్రులు 03
నేరుగా కూడా తీసుకురావొచ్చు
రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద గుర్తించిన విద్యార్థులకు నిపుణులతో కంటి పరీక్షలు చేయిస్తున్నాం. అయితే, వీరే కాకుండా దృష్టి సమస్యతో బాధపడే విద్యార్థులను తల్లిదండ్రులు నేరుగా స్క్రీనింగ్ పరీక్షలకు ఉపాధ్యాయుల ద్వారా తీసుకురావొచ్చు. విద్యార్థుల్లో దృష్టి సమస్యలను నివారించాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యం.
– టి.సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సత్తుపల్లి
విద్యార్థులపై ప్రత్యేక ‘దృష్టి’
Comments
Please login to add a commentAdd a comment