కరెంట్ పోయిందా.. మేమొస్తాం..
ఖమ్మంవ్యవసాయం: అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేలా జిల్లాకు ఎన్పీడీసీఎల్ ఆరు వాహనాలను కేటాయించింది. ఖమ్మం డివిజన్, వైరా డివిజన్లలో మూడు చొప్పున వీటిని వినియోగించనున్నారు. వేసవిలో ఈదురుగాలులు, ఇతర సమస్యలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఎదురయ్యే అవకాశముంది. ఈ సమయంలో సమాచారం అందగానే ప్రత్యేక వాహనాల్లో సిబ్బంది వెళ్లి సమస్యలను పరిష్కరించనున్నారు. వేసవిలో నాలుగు నెలల పాటు ఒక్కో వాహనానికి ఆరుగురు సిబ్బందిని కేటాయించి నెలలో 25రోజులకు గాను రోజువారీ వేతనాన్ని ఏజెన్సీ ద్వారా అందిస్తారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, చెడిపోవడం, ఇతర సమస్యలు తలెత్తినా లేదా సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో సిబ్బంది సామగ్రితో సహా వాహనంలో వెళ్లి మరమ్మతు చేశాక సరఫరాను పురుద్ధరిస్తారు. అలాగే, వ్యవసాయ భూముల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు, రైతులే సొంతంగా వాహనాలపై తీసుకురావాల్సి వస్తోంది. ఇకపై అత్యవసర వాహనాల్లో వీటిని తీసుకొచ్చి మరమ్మతుల అనంతరం తీసుకెళ్లి బిగించనున్నారు.
1912కు ఫోన్ చేయండి..
విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలందించేలా వారి సమస్యలను తెలి పేందుకు 1912 నంబర్‌ను వినియోగించుకోవాలని ఎస్‌ఈ ఏ.సురేందర్ ఓ ప్రకటనలో సూ చించారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు, లో ఓల్టేజీ, బ్రేక్ డౌన్, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, విద్యుత్ లైన్ల సమస్యలే కాక బిల్లుల్లో హెచ్చుతగ్గులు, సర్వీసుల్లో పేర్ల మార్పు, నూతన సర్వీసుల మంజూరు వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు 24గంటల పాటు అందుబాటులో ఉండే ఈ నంబర్‌కు ఫోన్ చేయొచ్చని తెలిపారు. ఈ నంబర్‌కు వచ్చే ఫోన్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారాన్ని ప్రత్యేక సెల్ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
విద్యుత్ శాఖకు
ఆరు వాహనాల కేటాయింపు
వేగంగా సమస్యలు పరిష్కరించేలా సిబ్బంది నియామకం
Comments
Please login to add a commentAdd a comment