
బోనస్.. మైనసేనా?
పౌర సరఫరాల సంస్థ ఏర్పాటుచేసిన
కేంద్రాల్లో సన్నధాన్యం అమ్మిన రైతులు దాదాపు సగం మందికి ఇంకా బోనస్
అందలేదు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ముగిసినా బోనస్ జమ కాకపోవడంతో ప్రతీరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
చేస్తున్నారు. జిల్లాలో 27,26,660 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మిన 47,494 మంది
రైతులకు రూ.136,33,30,000 బోనస్
అందాల్సి ఉంది. ఇందులో పలువురికి రూ.64.42 కోట్ల మేర బకాయి ఉండగా
ఎదురుచూపుల్లో గడుపుతున్నారు.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
సన్న ధాన్యానికి జై కొట్టి..
ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురవడం, జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి సాగు చేపట్టారు. ఇంతలోనే సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు తోడు రూ.500 బోనస్ ప్రకటించడంతో చాలామంది ఈ రకాలనే ఎంచుకున్నారు. జిల్లాలో 2,81,991 ఎకరాల్లో వరి సాగు చేయగా.. సన్న రకాలే 2,62,230 ఎకరాల్లో సాగయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సాధారణ వరి రకాలు క్వింటాకు రూ.2,300, గ్రేడ్–ఏ(సన్న రకం) ధాన్యానికి రూ.2,320గా మద్దతు ప్రకటించింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని ప్రకటించడంతో చాలామంది అటే మొగ్గుచూపారు.
344 కేంద్రాల ద్వారా సేకరణ
సన్నధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తే బోనస్ అందుతుందన్న విస్తృత ప్రచారంతో రైతులు ఆసక్తి కనబరిచారు. డీఆర్‌డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ద్వారా 344 కేంద్రాలను ఏర్పాటు చేయగా గతనెల 31వ తేదీతో కొనుగోళ్లు ముగిశాయి. ఆతర్వాత వైరా మండలంలోని సిరిపురం, ఉప్పలమడకతోపాటు బోనకల్ మండలంలోని బ్రాహ్మణపల్లి, మోటమర్రి, కలకోటల్లో ఇంకా ధాన్యం మిగలడంతో మళ్లీ కొనుగోళ్లు చేశారు. మొత్తంగా 47,494 మంది రైతుల నుంచి 27,26,660 క్వింటాళ్ల సన్న రకం ధాన్యం సేకరించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
మద్దతు ధర సరే బోనస్ ?
సన్నధాన్యం అమ్మిన రైతులకు మద్దతు ధరతో పాటే రూ.500 బోనస్ జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలామందికి బోనస్ నగదు జమ కాలేదు. ధాన్యం విక్రయించి నెలలు దాటుతున్నా బోనస్ రాకపోవడంతో అసలు ఇస్తారా, లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే ప్రతీరోజు బ్యాంకుల వెళ్లి ఖాతాల్లో బ్యాలెన్స్ పరిశీలించి వస్తున్నారు.
ఎందుకు రాలేదో.. ఏమో
సన్నధాన్యం విక్రయించిన రైతులకు విడతల వారీ గా బోనస్ జమ అవుతూ వస్తోంది. మొత్తంగా జిల్లా రైతులకు రూ.136,33,30,000 బోనస్ జమ కావా ల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూ.71,90,84,600 మాత్రమే అందాయి. మిగతా రూ.64,42,45,400 నగదు రాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. బోనస్ నగదు వస్తే యాసంగి పంటల పెట్టుబడికి ఆసరాగా ఉంటుందని రైతులు భావించినా నిరాశే ఎదురవడంతో మళ్లీ అప్పులు చేసి సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
సన్నధాన్యం విక్రయించిన రైతుల ఎదురుచూపులు
రూ.500 చెల్లింపు ప్రకటనతో సాగులో ముందడుగు
మద్దతు ధర దక్కినా బోనస్ అందక నిర్లిప్తత
Comments
Please login to add a commentAdd a comment