
జియోథర్మల్ విద్యుదుత్పత్తిలో ముందడుగు
● పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి నమోదు ● పగిడేరులో దేశంలోనే మొట్టమొదటి ప్లాంట్
మణుగూరు టౌన్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో ముందుడుగు పడింది. మండలంలోని పగిడేరులో బోరు నుంచి వస్తున్న వేడినీటితో జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని కొన్నేళ్ల క్రితం గుర్తించగా 20 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేశారు. క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంకిన్ సైకిల్(ఓఆర్‌సీ) టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్‌ను సింగరేణి ఆధ్వర్యాన ఢిల్లీలోని శ్రీరాం ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ బాధ్యులు చేపట్టారు. ఈమేరకు రెండు రోజులుగా ఇక్కడ ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా 20 కిలోవాట్ల పూర్తిస్థాయి సామర్థ్యంతో నమోదైంది. ఇది విజయవంతమైన నేపథ్యాన ఇంకొన్ని పరీక్షలు చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దేశంలోనే తొలి కేంద్రం
జియోథర్మల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి కేంద్రప్రభుత్వం 1960 నుంచే ‘హాట్ స్ప్రింగ్స్’ కమిటీ ఏర్పాటు చేసి పరిశోధనలు చేయిస్తోంది. ఈక్రమాన 1992లో హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మణికరణ్ ప్రాంతంలో ఐదు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసినా కొండచరియలు విరిగి పడడంతో అది ధ్వంసమైంది. ఆతర్వాత పలు రాష్ట్రాల్లో జియోథర్మల్ కోసం అన్వేషణలు సాగించినా విజయవంతం కాలేదు. చివరకు పగిడేరులో బొగ్గు అన్వేషణకు వేసిన బోర్ నుంచి వేడినీరు ఉబికి వస్తుండడంతో జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుచేశారు. కాగా, ప్రయోగాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి పూర్తిస్థాయిలో నమోదైన నేపథ్యాన దేశంలోనే తొలి ప్లాంట్‌గా నిలవనుంది.

జియోథర్మల్ విద్యుదుత్పత్తిలో ముందడుగు
Comments
Please login to add a commentAdd a comment