
ఇందిరమ్మ లబ్ధిదారులకు తోడ్పాటు
● యంత్రాంగం ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మంసహకారనగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు యంత్రాంగం ప్రతీ దశలో తోడ్పాటునందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల అధికారులు, మండల ప్రత్యేక అధికారులకు ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లతో ప్రజల జీవన విధానంలో మార్పులు వస్తాయని గుర్తించి అర్హులనే ఎంపిక చేయాలని తెలిపారు. గ్రామసభల్లో అందిన దరఖాస్తులను యాప్ ద్వారా మరోసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు, స్థలం, ఇల్లు లేనివారు, ఆర్‌సీసీ రూఫ్‌తో ఇల్లు ఉన్న వారిని మూడు కేటగిరీలుగా విభజించాలని, అత్యంత పేదలు, సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతేకాక భూమి పూజ మొదలు గృహప్రవేశం వరకు ప్రతీ అడుగులో లబ్ధిదారులకు అండగా నిలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. కాగా, ఇసుక సరఫరాను పర్యవేక్షించాలని, సిమెంట్ తక్కువ ధరకు అందేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిశాక రెండు వారాల్లో బేస్‌మెంట్ పూర్తయ్యేలా చూస్తే లబ్ధిదారులకు రూ.లక్ష నగదు అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీపీఓ ఆశాలత, హౌజింగ్ పీడీ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టర్ జిల్లాలో ఏర్పాట్లను వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ ఉద్యోగులకు శిక్షణ, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ జారీ, కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లను వెల్లడించారు. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment