
సమస్యలు పరిష్కరించాలని నిరసన
ఖమ్మంగాంధీచౌక్: ఖాళీ పోస్టు ల భర్తీ, తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వారానికి ఐదు రోజుల పనిదినాల అమలుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూని యన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో పలువురు మాట్లాడుతూ ఈనెల 7నుంచి మొదలైన దశలవారీ ఆందోళనలు సమస్యలు పరిష్కారమయ్యే వరకు కొనసాగుతాయని తెలిపారు. యూనియన్ల ప్రతినిధులు షేక్ ఇబ్రహీం, ఆర్.శివకుమార్, శ్రీనివాస్ నందన్, పి.చిన్నపరెడ్డి, ఆశాజ్యోతి, కృష్ణవేణి, ప్రసాద్, రాంబాబు, తిప్పయి స్వామి తదితరులు పాల్గొన్నారు.
శివాలయంలో చోరీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం మమత రోడ్డులోని శివాలయంలో చోరీ జరిగింది. రోజులాగే గురువారం రాత్రి తాళం వేసి వెళ్లిన అర్చకులు, సిబ్బంది శుక్రవారం ఉదయం వచ్చేసరికి ఐదు తాళాలు ధ్వంసం చేసి ఉన్నాయి. దీంతో దేవాలయంలో పరిశీలించగా రూ.4లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలతో పాటు హుండీని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం అర్బన్ పోలీసులు చేరుకుని ఆధారాలు సేకరించారు.
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
కారేపల్లి: మండలంలోని మాదారంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవా రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ఒక బైక్, ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎన్.రాజారాం తెలిపారు.
కోడిపందేలు ఆడుతున్న ఇద్దరు...
కల్లూరు: మండలంలోని పేరువంచ సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కన కోడి పందేలు ఆడుతున్న ఇద్దరిని శుక్రవారం అదుపులోకి తీసుకోగా, ఇంకొందరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రెండు కోడి పుంజులు, రూ.1,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష
ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ఆబ్కారీ కోర్టు న్యాయాధికారి రాళ్లబండి శాంతిలత శుక్రవారం తీర్పు చెప్పారు. ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన కుతుంబాక ప్రవీణ్‌కుమార్ రోటరీనగర్‌కు చెందిన పోలవరపు రమేష్ వద్ద 2016 ఏప్రిల్‌లో రూ.7లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పులు చెల్లించాలని అడగగా 2017ఆగస్టులో రూ.9లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, ఈ చెక్కును బ్యాంకు జమ చేయగా ప్రవీణ్ ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో రమేష్ తన న్యాయవాది ద్వారా కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనతరం ప్రవీణ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.9లక్షలు చెల్లించాలంటూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అక్క ఇంటికి వచ్చి వెళ్తుండగా అనంతలోకాలకు..
లారీ ఢీకొట్టి పైనుంచి వెళ్లడంతో చిధ్రమైన మృతదేహం
తల్లాడ: మండలంలోని రంగంబంజర సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. పెనుబల్లి మండలం ముత్తగూడెంకు చెందిన బొగ్గుల నాగిరెడ్డి(55) గ్యాస్‌సిలిండర్ కోసం టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై కల్లూరు వచ్చాడు. సమీపంలోని తల్లాడ మండలం నారాయణపురంలో సోదరి అవులూరి వెంకటరత్తమ్మ ఉంటుండడంతో ఆమె వద్దకు వచ్చి పలకరించాక తిరిగి బయలుదేరాడు. ఈక్రమాన రంగంబంజర వద్ద ఆయనను వెనక నుంచి తల్లాడ వైపు నుంచి కల్లూరు వెళ్తున్న కంటెయినర్ లారీ ఢీకొట్టింది. లారీ నాగిరెడ్డి పైనుంచి వెళ్లడంతో రెండు కాళ్లు తెగిపడి, శరీరం ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, నాగిరెడ్డికి భార్య, కుమారుడు ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సమస్యలు పరిష్కరించాలని నిరసన
Comments
Please login to add a commentAdd a comment