ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్‌రెడ్డి
● రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం ● సిట్టింగ్ ఎమ్మెల్సీపై 5,521 ఓట్ల మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఖమ్మం – వరంగల్ – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. అయితే నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేకపోవడంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. దీంతో శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించగా గెలుపు ఖరారైంది.
ఉదయం 7గంటల నుంచి కౌంటింగ్..
ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రక్రియ మొదలుకాగా, ఉదయం 11 గంటల వరకు బండిల్స్ కట్టాక లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 24,135 ఓట్లు పోల్ కాగా 494 ఓట్లు చెల్లలేదు. ఇక 23,641 ఓట్లు చెల్లుబాటు కాగా, ఇందులో సగానికి మించి ఒక్క ఓటు కలిపి 11,821గా గెలుపు కోటా ఓటును నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా 6,035 ఓట్లు రావడం, గెలుపు కోటాకు సరిపోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. కాగా, లెక్కింపులో ఒక్కో రౌండ్ పూర్తవుతుండగా ఉత్కంఠ నెలకొంది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా.. ద్వితీయ స్థానంలో ఉన్న నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్‌రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తర్వాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. అయినా కోటా రాకపోయినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు.
ఎలిమినేషన్‌లో ఓట్లు పెరిగాయి ఇలా..
మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ బలపర్చిన అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్‌రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటి వరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్‌రాజును ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఈమేరకు 15వ రౌండ్‌లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగి 6,916కి చేరాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. మిగతా వారికి కూడా ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగింది. ఇక 16వ రౌండ్‌లో పులి సరోత్తంరెడ్డి, 17వ రౌండ్‌లో పూల రవీందర్, 18వ రౌండ్‌లో హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్ చేశారు. అప్పటికి శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 11,099కు, నర్సిరెడ్డి ఓట్లు 8,448కు చేరాయి. దీంతో నర్సిరెడ్డిని సైతం ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌డ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈమేరకు 2,870 ఓట్లు కలిపి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించడంతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.
పీఆర్‌టీయూ నేతల సంబురాలు..
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించగా సోమవారం రాత్రి ఖమ్మంలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో నాయకులు సంబురాలు జరుపుకున్నారు. నాయకులు కట్టా శేఖర్‌రావు, కూరాకుల సైదయ్య, గుత్తా శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రాయల నర్సింహరావు, పుసులూరి శ్రీనివాసరావు, షఫీ, వెంకన్న, వీరయ్య చౌదరి, నరేందర్, తాళ్లూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్‌రెడ్డి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment