సాగర్ ఆయకట్టుకు ‘సీతారామ’ నీరు
ప్రాజెక్టుతో రెండు జిల్లాలు సస్యశ్యామలం
● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అశ్వాపురం/ములకలపల్లి: నాగార్జునసాగర్ ఆయకట్టులో పంటలు ఎండిపోకుండా గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను సీతారామ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టతో పాటు బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ –1 పంప్‌హౌస్, ములకలపల్లి మండలంలోని వీ.కే.రామవరం, కమలాపురంలోని పంప్‌హౌస్‌లను సోమవారం మంత్రి పరిశీలించి మాట్లాడారు. గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను సాగర్ ఆయకట్టు పరిరక్షణకు కేటాయిస్తున్నామని చెప్పారు. అశ్వాపురం, ములకలపల్లి మండలాల్లోని పంప్‌హౌస్‌ల ద్వారా 100 కి.మీ. మేర గోదావరి జలాలు ప్రవహించి రాజీవ్ కెనాల్ నుంచి సాగర్ కెనాల్‌కు మంగళవారం సాయంత్రానికి చేరతాయని తెలిపారు. తద్వారా సాగర్ చివరి ఆయకట్టు ఎంబీసీ మధిర బ్రాంచ్ కెనాల్, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మండలాల చివరి ఆయకట్టుకు సాగర్ జలాలు పూర్తి స్థాయిలో అందుతాయన్నారు. ఈకార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నీటి పారుదల ఎస్‌ఈలు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్‌తో పాటు నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుక్కాని మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దిగువకు గోదావరి జలాలు
ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్‌హౌస్– 3 నుంచి గోదావరి జలాలు దిగువకు తరలాయి. ఇక్కడ మోటార్ ద్వారా నీటిని ఎత్తిపోయగా, గ్రావిటీ ద్వారా ఏన్కూరు లింక్ కెనాల్‌కు వెళ్లాయి. సోమవారం రాత్రి 8గంటల సమయాన నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం సాయంత్రంలోగా గోదావరి జలాలను సాగర్ కాల్వలో కలుపుతామని మంత్రి తుమ్మల ప్రకటించిన నేపథ్యాన అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment