● పరారీలోనే లింగ నిర్ధారణ పరీక్షల కేసులో ప్రధాన నిందితుడు ● రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు
చింతకాని: వాహనంలో తిరుగుతూ అనుమతి లేకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాలో కీలక నిందిడుతైన ఖమ్మం బల్లేపల్లికి చెందిన చారి జాడ ఇంకా తెలియరాలేదు. కారులో తిరుగుతూ గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా సభ్యులు ఇద్దరు చింతకాని మండలం కొదుమూరులో ఇటీవల పట్టుబడ్డారు. వీరి నుంచి వాహనం, స్కానింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకోగా కీలక నిందితుడైన చారి ఆచూకీ కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఆయన పట్టుబడితే ముఠాకు సహకరించిన వారెవరనే అంశంలో కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు.
ఇద్దరు ఆర్‌ఎంపీలు.. ఒక అసిస్టెంట్
బల్లేపల్లికి చెందిన చారి గతంలో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పీఆర్‌ఓగా పనిచేసి, ఆతర్వాత గ్రామీణ వైద్యుడిగా కొంతకాలం పనిచేశాడు. ఈక్రమంలోనే చింతకాని మండలం కొదుమూరుకు చెందిన ఆర్‌ఎం రాచబంటి మనోజ్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు రోగులను తీసుకెళ్లే క్రమాన అక్కడ స్కానింగ్ అసిస్టెంట్, ఖమ్మం అల్లీపురానికి చెందిన కాత్యాయిని పరిచయం కావడంతో ముగ్గురు త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో సెకండ్ హ్యాండ్ కారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఆపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు గ్రామాలకు వెళ్లి మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు చేసేవారు. గర్భంలో ఉన్నది ఆడా, మగా అని నిర్ధారించడంతో ఆడశిశువు వద్దనుకుంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భస్రావం చేయించి కమీషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే వీరి కదలికలపై నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత గురువారం మనోజ్ స్వగ్రామమైన కొదుమూరులో ముగ్గురికి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయాన మనోజ్, కాత్యాయినిని అదుపులోకి తీసుకోవడంతో స్కానింగ్ యంత్రం, కారును సీజ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన చారి మాత్రం ఇప్పటివరకు పట్టుబడకపోగా, రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఎస్సై నాగుల్‌మీరాను వివరణ కోరగా పరారీలో ఉన్న చారి ఆచూకీని కనుగొనేందుకు రెండు బృందాలచే గాలింపు చేపడుతున్నామని తెలిపారు. ఆయన పట్టుబడితే పూర్తి వివరాలు బయటపడతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment