మిర్చిబోర్డు ఏర్పాటు చేయాల్సిందే..
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి క్రయవిక్రయాలు జరిగే ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.25వేల చొప్పున ధర చెల్లించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. పెట్టుబడులు పెరిగి, తెగుళ్లతో దిగుబడి తగ్గి రైతులు ఆందోళన చెందుతుండగా, వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడంతో మరింత నష్టం ఎదురవుతోందని చెప్పారు. ఈమేరకు సోమవారం సీపీఐ, సీపీఎం, బీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీలు, అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించగా నాయకులు మాట్లాడారు. గతేడాది క్వింటాకు రూ.20వేల ధర పలకగా, ఇప్పుడు రూ.12 వేల నుంచి రూ.13వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో అత్యధికంగా మిర్చి సాగవుతుండడమే కాక క్రయవిక్రయాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నందున మిర్చిబోర్డు ఏర్పాటుచేసి, ప్రభుత్వ సంస్థల ద్వారా క్వింటా రూ.25వేల చొప్పున కొనుగోలు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోత్ చంద్రావతి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్‌రావు, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, అడపా రామకోటయ్య, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, ఆవుల వెంకటేశ్వర్లు, పగడాల నాగరాజు, పుచ్చకాయల సుధాకర్, బాగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ధర్నా అనంతరం నాయకులు కలెక్టర్‌ను కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని ఐదుగురిని మాత్రం అనుమతించారు.
అఖిలపక్షం ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment