దగా చేస్తే ఉపేక్షించేది లేదు
● గిట్టుబాటు ధరతో మిర్చి కొనుగోలు చేసేలా పర్యవేక్షణ ● ఖమ్మం మార్కెట్‌లో పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తనిఖీ
ఖమ్మంవ్యవసాయం: మిర్చి తీసుకొచ్చే రైతులను ధర విషయంలో ఎవరు దగా చేయాలని ప్రయత్నించినా చర్యలు తప్పవని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. మిర్చి ధర పతనమవుతున్న నేపథ్యాన కలెక్టర్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతను పరిశీలించిన ఆయన ధరలపై ఆరా తీయగా పలువురు రైతులు తక్కువగా చెల్లిస్తున్నారని, జెండాపాటతో పొంతన ఉండడం లేదని వాపోయారు. దీంతో పంట నాణ్యతగా ఉన్నా ధర ఎందుకు తక్కువగా చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి ధరలో న్యాయం జరిగేఽలా చూస్తామని రైతులకు భరోసా కల్పించిన కలెక్టర్.. కొనుగోళ్లలో వేగం, నగదు చెల్లింపులు, మద్దతు ధరపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐ ద్వారా సులభంగా బోధన
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత బోధనను పరిశీలించిన ఆయన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాక మాట్లాడారు. జిల్లాలోని ఏడు పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలుచేస్తున్నామని, విద్యార్థులు తెలుగు, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడడం, గణితంపై పట్టు సాధించేలా చూడడమే లక్ష్యమన్నారు. విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి కె.రవికుమార్, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి, జీసీడీఓ తులసి, హెచ్‌ఎం బుర్రి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ మరింత నమ్మకం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వివిధ విభాగాల్లో పరిశీలించి చికిత్స కోసం వచ్చిన వారితో సేవలపై ఆరా తీశారు. అనంతరం నూతన భవనాల నిర్మాణ పనులు, దివ్యాంగులచే నిర్వహిస్తున్న పెయిడ్ పార్కింగ్, మహిళా శక్తి క్యాంటీన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే వారితో వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తించడమే కాక మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
దగా చేస్తే ఉపేక్షించేది లేదు
Comments
Please login to add a commentAdd a comment