సేవాలాల్ గద్దెల తొలగింపుపై ఆందోళన
కారేపల్లి: బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ గద్దెలను తొలగించడంపై గిరిజనులు కారేపల్లిలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇటీవల కారేపల్లి సర్వే నంబర్ 38లోని ప్రభుత్వ స్థలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించగా, గద్దెలు నిర్మించారు. అయితే, ఇక్కడ 17 గుంటల భూమిని గతంలోనే కారేపల్లి బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి కేటాయించి బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇంతలోనే గద్దెలు నిర్మించినట్లు తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ అధికారులు నిర్మాణ బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక, సోమవారం గద్దెలు, దేవతల రాళ్లను తీయించారు. ఈ విషయం తెలియంతో బుధవారం వివిధ గ్రామాల బంజారాలు, వివిధ సంఘాల నాయకులు కారేపల్లిలో ఆందోళన చేపట్టారు. బస్టాండ్ సెంటర్‌లో గంట పాటు రాస్తారోకో చేయగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, కారేపల్లి, కామేపల్లి ఎస్‌ఐలు ఎన్.రాజారాం, సాయికుమార్ చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. చివరకు దేవతల రాళ్లు, జెండాలు ఏర్పాటుచేయడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment