‘ప్రభుత్వ చొరవ లేకే మిర్చి ధర పతనం’
ఖమ్మంమయూరిసెంటర్: మిర్చి ఎగుమతులకు ప్రభుత్వం చొరవ చూపకపోవడం, గతేడాది పండించిన పంట నిల్వ ఉండడంతో ధర గణనీయంగా పడిపోయిందని వ్యవసాయ శాస్త్రవేత్త బలేజిపల్లి శరత్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మహాసభల సందర్భంగా మంగళవారం ‘మిర్చి ధర పతనం– పరిష్కార మార్గాలు’ అంశంపై జిల్లా పరిషత్ హాల్‌లో సదస్సు ఏర్పాటుచేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులో శరత్‌బాబు మాట్లాడుతూ దేశంలో పండించిన వివిధ రకాల మిర్చిని ఇతర దేశాలు దిగుమతి చేసుకునేవని.. ఈ ఏడాది అక్కడి పరిస్థితులు, అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ధరల పతనానికి కారణమయ్యాయని తెలిపారు. ప్రధాని మోదీ ట్రంప్‌తో సమావేశమైనప్పుడు ఎగుమతుల విషయంపై చొరవ తీసుకుంటే ఫలితం ఉండేదని చెప్పారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మిర్చి బోర్డు ఏర్పాటు చేసి నాఫెడ్ ద్వారా క్వింటాకు రూ.25వేల చొప్పున కొనుగోలు చేయాలని, తద్వారా రైతులకు న్యాయం జరుగుతుందంటూ తీర్మానం చేశారు. సదస్సులో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతితో పాటు వివిధ సంఘాల నాయకులు కొండపర్తి గోవిందరావు, నల్లమల వెంకటేశ్వరరావు, పోతినేని సుదర్శన్‌రావు, గుర్రం అచ్చయ్య, దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment