ఈనెల 10న ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

ఈనెల 10న ఇంటర్వ్యూలు

Published Thu, Mar 6 2025 12:29 AM | Last Updated on Thu, Mar 6 2025 12:32 AM

ఈనెల 10న ఇంటర్వ్యూలు

ఈనెల 10న ఇంటర్వ్యూలు

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ విడుదల చేసిన మొదటి ఎక్స్‌టర్నల్‌ నోటిపికేషన్‌కు సంబంధించి టెక్నికల్‌ పరీక్షలు గతేడాది జూన్‌లో నిర్వహించిన విషయం విదితమే. ఆ పరీక్షలో మెరిట్‌ సాధించిన కొంతమంది జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వగా మిగిలిన మరో 36 మందికి ఈనెల 10వ తేదీన కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. సంబంధిత అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించామని పేర్కొంది.

క్షయరహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

బోనకల్‌: జిల్లాకు క్షయరహితంగా రూపుదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ వరికూటి సుబ్బారావు తెలిపారు. మండల కేంద్రంలోని శాంతి నిలయంలో మానసిక దివ్యాంగులకు క్షయ వ్యాధి పరీక్షలను బుధవారం ఆయన తన సొంత ఖర్చులతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లడుతూ వారానికి మించి దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటూ పరీక్ష చేయించుకోవాలని, క్షయగా నిర్ధారణ అయితే ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. పీహెచ్‌సీ వైద్యాధికారి స్రవంతి, ఉద్యోగులు యాకూబ్‌, విజయ్‌కుమార్‌, సందీప్‌, శివ, విజయ, దుర్గ, శాంతినిలయానికి చెందిన ఆల్పీ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో బాలుడు మృతి

ఖమ్మంక్రైం: ఖమ్మం ఎఫ్‌సీఐ బైపాస్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన నంగనూరి సిద్దు(17) ఇంటర్‌ ఫెయిల్‌ కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆయన ఖమ్మంలో ఉండే స్నేహితుడు సంతోష్‌ను కలిసేందుకు బుధవారం వచ్చాడు. ద్విచక్రవాహనంపై సంతోష్‌, మరో స్నేహితుడితో కలిసి సిద్దు వెళ్తుండగా బైపాస్‌ వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సిద్దు అక్కడిక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలికి ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

సెంట్రింగ్‌ కార్మికుడు ఆత్మహత్య

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం రామన్నపేటకు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు షేక్‌ ఖాజామియా(38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన పనికి వెళ్లడంలేదు. మంగళవారం రాత్రి భార్యను డబ్బులు అడిగితే లేవని చెప్పడంతో ఆమె వంట గదిలో ఉన్నప్పుడు మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఖాజామియా భార్య ఫర్జానా ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాశ్‌ తెలిపారు.

రూ.60.70 లక్షలకు మిర్చి వ్యాపారి ఐపీ

ఖమ్మం లీగల్‌: ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌కు చెందిన మిర్చి వ్యాపారి బోగా శ్రీనివాసరావు రూ.60.70 లక్షలకు బుధవారం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దివాలా పిటీషన్‌(ఐపీ) దాఖలు చేశాడు. ఖమ్మం మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు చేపట్టే ఆయన పలువురి అప్పులు చేయగా, తీర్చలేని పరిస్థితి ఎదురైందని 18మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా కోర్టులో దివాలా పిటీషన్‌ దాఖలు చేశాడు.

రూ.24.10 లక్షలకు..

ఖమ్మం శ్రీనివాస నగర్‌కు చెందిన అయ్యప్ప హాస్టల్‌ యజమాని కొండపల్లి లత రూ.24.10 లక్షలకు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దివాలా పిటీషన్‌ దాఖలు చేశారు. వ్యాపార అభివృద్ధి చేసిన అప్పులు తీర్చలేకపోతున్నానని పేర్కొంటూ, 12 మందిని పిటీషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

రూ.75 లక్షలకు తండ్రీకుమార్తె...

ఖమ్మం లీగల్‌: ఖమ్మం పాండురంగాపురం కాలనీకి చెందిన తండ్రీకుమార్తెలు షేక్‌ సైదులు, షేక్‌ రేష్మ రూ.75 లక్షలకు దివాలా పిటిషన్‌ దాఖలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కొనసాగిన వీరు చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందని పేర్కొంటూ నలుగురినీ ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో బుధవారం ఐపీ దాఖలు చేశారు.

బెదిరించిన ఘటనలో ఐదుగురిపై కేసు

కొణిజర్ల: దూషించడమే కాక చంపుతానని బెదిరిస్తున్నారంటూ గ్రీన్‌ల్యాండ్‌ డెవలపర్స్‌ పార్టనర్‌ ముళ్ల కిషోర్‌ ఫిర్యాదుతో ఇండోఖతార్‌ ప్రాజెక్ట్‌ ఎండీ ఎం.గిరితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి.సూరజ్‌ తెలిపారు. 2018లో గ్రీన్‌లాండ్‌ డెవలపర్స్‌ నుంచి ఇండోఖతార్‌ డెవలపర్స్‌కు విల్లాల నిర్మాణానికి అగ్రిమెంట్‌ చేసుకోగా ఆతర్వాత రద్దవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి పోలీసుల వద్దకు కేసు చేరింది. ఈక్రమాన గతనెల 25న ఇండోఖతార్‌ ఎండీ గిరి, సిబ్బంది యాకూబ్‌రెడ్డి, యాకూబ్‌ పాషా, జేపీ, రాంబాబు తనను దూషించి, పాటు చంపుతామని బెదిరించారని కిషోర్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement