ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Fri, Mar 7 2025 12:12 AM | Last Updated on Fri, Mar 7 2025 12:12 AM

-

రఘునాథపాలెం: మండలంలోని రజబ్‌అలీ నగర్‌కు చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల 5వ తేదీ బుధవారం ఆమెను పక్క ఇంట్లో ఉండే రామి అనే మహిళ తీసుకెళ్లి తన కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా స్థానికులు పలువురికి చెప్పింది. దీంతో బాలిక మనస్తాపంతో బుధవారం రాత్రి కలుపు మందు తాగగా, కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తుండగా గురువారం మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు. కాగా, సదరు విద్యార్థిని గురువారం మొదలైన వార్షిక పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం.

ఉరి వేసుకుని...

నేలకొండపల్లి: మండలంలోని రాజేశ్వరపురానికి చెందిన సీ.హెచ్‌.వీరబాబు (35) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనారోగ్య కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కూసుమంచి: మండలంలోని గట్టుసింగారం పెట్రోల్‌ బంక్‌ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బూరెడుగుట్ట తండాకు చెందిన మూడ్‌ లక్ష్మణ్‌(35) తన ద్విచక్ర వాహనంపై కూసుమంచి నుండి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమాన గట్టుసింగారం నుండి కూసుమంచి వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఆయనను ఢీకొట్టగా తలకు తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరు గాయపడగా 108లో ఖమ్మం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నం

సత్తుపల్లిరూరల్‌: భార్యాభర్తల మధ్య గొడవతో మనస్థాపానికి గురైన వ్యక్తి బ్లేడ్‌తో చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని కిష్టారానికి చెందిన పాలకుర్తి నాగరాజుకు గ్రామానికే చెందిన సౌమ్యను పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, దంపతుల మధ్య గొడవతో సౌమ్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మద్యానికి బానిసైన నాగరాజుకు ఆర్థిక ఇబ్బందులు తోడవడం, భార్య రావ డం లేదనే మనస్థాపానికి గురై మద్యం మత్తులో గురువారం మధ్యాహ్నం రెండు చేతులపై బ్లేడ్‌తో కోసుకున్నాడు. దీంతో రక్తస్రావం అవుతుండగా 108లో సత్తుపల్లికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.

పశుసంవర్థక శాఖ జేడీపై కేసు నమోదు

ఖమ్మంక్రైం: అపార్ట్‌మెంట్‌ నిర్మించి ఇస్తామని నమ్మించి మోసం చేసిన పశు సంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ తెలిపారు. డీడీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోనూ కొనసాగుతున్నట్లు తెలుస్తుండగా, ఖమ్మం అర్బన్‌ మండలం వెలుగుమట్ల ప్రాంతంలో సర్వే నంబర్‌ 546లోని నాలుగు ఎకరాల భూమిలో హ్యాపీ హోం అపార్టుమెంట్‌ 24 నెలల్లో నిర్మించి ఇస్తామని 2021లో ఆయన పలువురితో అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఈమేరకు వారి నుంచి ప్లాట్లకు డబ్బు కూడా తీసుకున్నాడు. అయితే, గడువులోగా నిర్మాణం పూర్తికాకపోవడంతో ఖమ్మంరూరల్‌ మండలం ఏదులాపురానికి చెందిన మారుపాక వెంకటాచారి ఇచ్చిన ఫిర్యాదుతో డీడీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రూ.35 లక్షలకు ఐపీ దాఖలు

ఖమ్మం లీగల్‌: ఖమ్మంకు చెందిన కిరాణ వ్యాపారి మేడబోయిన వేణు రూ.35.20లక్షలకు దివాళా పిటిషన్‌(ఐపీ) దాఖలు చేశాడు. వ్యాపార అభివృద్ధి చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ 22 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా ఖమ్మం సివిల్‌ జడ్జి కోర్టులో గురువారం ఐపీ దాఖలు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement