మరో రోజు రండి..
జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం
● 748 షాపులకు గాను 90 షాపులకే సరఫరా ● ఇతర జిల్లాల్ల్లో ప్రయత్నించినా నిల్వలు లేవని సమాధానం ● ఖరీఫ్‌లో సేకరించిన దొడ్డు బియ్యం పంపిణీపై దృష్టి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఈనెల మొదటి వారం పూర్తికావొస్తున్నా జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా నత్తనడకన సాగుతోంది. ప్రతినెలా 1నుంచి 15వ తేదీ లోపు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేవారు. కానీ రెండు, మూడు నెలల నుంచి సరఫరాలో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ఈనెల కూడా షాప్‌లకు పూర్తిస్థాయిలో బియ్యం చేరకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో బియ్యం నిల్వలు అడుగంటగా, ఇతర జిల్లాల నుంచీ అదే సమాధానం రావడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీంతో వానాకాలంలో కొనుగోలు చేసి మర ఆడించిన ధాన్యాన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేస్తుండగా అన్ని షాపులకు చేరేవరకు ఇంకా సమయం పట్టనుంది.
748 షాపుల ద్వారా పంపిణీ
జిల్లాలో మొత్తం 4,11,566 రేషన్ కార్డులు ఉండగా, 748 షాప్‌ల ద్వారా 11,29,030 మంది లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీనెలా 6,343 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రతినెలా ఒకటో తేదీ కల్లా షాపులకు బియ్యం చేరవేస్తే డీలర్లు 1నుంచి 15వ తేదీవరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
ఇతర జిల్లాల్లోనూ లభ్యత లేక..
జిల్లాలో బియ్యం నిల్వలు సరిపడా లేకపోవడంతో ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి సరఫరా చేస్తోంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి ఇక్కడి గోదాంలకు 24నుంచి 30 తేదీలోపు చేరిస్తే.. ఆపై షాపులకు పంపించి లబ్ధిదారులకు ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాల అధికారులు సైతం తమ వద్ద బియ్యం ని ల్వలు లేవని సమాధానం ఇవ్వడంతో ఇక్కడ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
వానాకాలం బియ్యమే..
ఇతర జిల్లాల్లోనూ బియ్యం లేనందున స్థానికంగానే ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది వానాకాలంలో రైతులు 90 శాతం సన్న ధాన్యం, 10 శాతం దొడ్డు ధాన్యం సాగు చేయగా.. పౌర సరఫరా సంస్థ ద్వారా సేకరించారు. ఇందులో దొడ్డు ధాన్యాన్ని మర ఆడించి రేషన్ దుకాణాలకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. అయితే, ఇప్పటివరకు జిల్లాలోని 748రేషన్ షాప్‌లకు గాను 90దుకాణాలకే చేరాయి. ఆయా దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేస్తుండగా, మిగతా షాపులకు వెళ్లిన లబ్ధిదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
వారం రోజుల్లో సరఫరా చేస్తాం..
జిల్లాలోని అన్ని రేషన్ షాప్‌లకు వారంలోగా బియ్యం సరఫరా చేస్తాం. సూర్యాపేట, నల్లగొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ప్రయత్నించినా అక్కడ కూడా నిల్వలు లేవనే సమాధానం వచ్చింది. దీంతో జిల్లాలోనే వానాకాలం సేకరించిన ధాన్యాన్ని మర ఆడించి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున త్వరలోనే అన్ని షాపులకు బియ్యం చేరవేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూస్తాం.
– శ్రీలత, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ
ప్రతీనెలా సమస్యే
రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాలో ఇటీవల కొద్దినెలలుగా సమస్యలు ఎదురవుతున్నాయి. పోర్టబులిటీ విధానంలో ఎక్కడ కార్డు ఉన్నా.. ఇతర ప్రాంతాల్లోనూ బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండడంతో జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీ కేంద్రాల్లో బియ్యం నిల్వ లు త్వరగా అడుగంటుతున్నాయి. ఇలా పోర్టబులిటీ ద్వారా ఇచ్చిన బియ్యం వివరాలను డీలర్లు 7, 8వ తేదీకల్లా జిల్లా పౌరసరఫరాల అధికారులకు సమర్పిస్తే గోదాంల నుంచి అదనంగా కోటా విడుదల చేస్తారు. అయితే, డీలర్లకు కావాల్సిన బియ్యమే కాక అదనపు కోటా కూడా రాకపోవడంతో షాపుల వద్ద బియ్యం స్టాక్ లేవని, ఫలానా తేదీన రావొచ్చని బోర్డులు ఏర్పాటుచేస్తుండడంతో లబ్ధిదారులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని గోదాంల్లో బియ్యం నిల్వలు నిండుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుండగా.. గత నెల 25 వరకు, అంతకు ముందు నెల 30వ తేదీ వరకు బియ్యం సరఫరా కొనసాగించారు.
సన్నబియ్యం ఎప్పుడు ?
రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ఈనెల కూడా దొడ్డు బియ్యమే ఇస్తుండగా, సన్న బియ్యం పంపిణీ చేసేదెప్పుడో స్పష్టత రావడం లేదు. ఉగాది పండుగ నుంచైనా రేషన్ దుకాణాలు, వసతి గృహాలకు సన్న బియ్యం పంపిణీ ఉంటుందా, లేదా అన్న
సందిగ్ధత నెలకొంది.
మరో రోజు రండి..
మరో రోజు రండి..
Comments
Please login to add a commentAdd a comment