
అడుగు ముందుకే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘అమ్మే నా తొలి గురువు. ఆమె పెద్దగా చదువుకోలేదు. కానీ నన్ను ముందుకు నడిపించింది. ఎక్కడ పడిపోతే.. అక్కడి నుంచే నీ కొత్త ప్రయాణం మొదలుపెట్టమని చెప్పింది. నన్ను జడ్జిగా చూడాలన్న ఆమె కోరికను నెరవేర్చగలిగాను. మహిళలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి.’ అని జిల్లా ఒకటో అదనపు న్యాయమూర్తి కె.ఉమాదేవి పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పేజీ లే ఔట్, మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి సూచనలు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఉమాదేవి తన ప్రస్థానం, మహిళా సాధికారతపై వెల్లడించిన వివరాలు ఆమె మాటల్లోనే..
● దృఢ సంకల్పంతో సాగితేనే విజయం ● నన్ను జడ్జిగా చూడాలన్నదే మా అమ్మ కల ● జిల్లా అదనపు న్యాయమూర్తి ఉమాదేవి
మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా విధులు
నిరాశకు తావివ్వొద్దు..
మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులో వంద శాతం కృషి చేయాలి. ఏ పనైనా ఇష్టంతో చేయాలి. లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలే తప్ప ఎక్కడో ఏదో జరిగిందని కుంగిపోవద్దు. మనకు మన లక్ష్యమే కనపడాలి. మంచి, చెడును సమానంగా స్వీకరించగలిగే స్థితప్రజ్ఞత సాధించాలి. మహిళలు ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఇక చాలు నా జీవితం అయిపోయిందనే భావనను మనసులోంచి తీసేయాలి. అప్పుడే అనుకున్న దాని కన్నా మంచి స్థితిలో ఉంటాం. చిన్నతనం నుంచే మహిళలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యం. వారి లక్ష్యాలకు అండగా ఉండాలి.
ఎవరేం అనుకుంటారోనని ఆలోచించొద్దు..
మహిళల్లో ఎక్కువ మంది వాళ్లేం అనుకుంటారో.. వీళ్లేం అనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. అలా కాకుండా మనమేం అనుకుంటున్నామో అదే ముఖ్యం. నలుగురు ఏమనుకుంటారో అనే భావన తీసేస్తేనే జీవితంలో ఎదగగలుగుతాం. అప్పుడే ఎంత కఠినమైన పనైనా చేయగలం. జీవితంలో ఏదీ సులువు కాదనే విషయాన్ని అంగీకరించాలి.
అమ్మే నా మొదటి గురువు..
మేము నలుగురు ఆడపిల్లలం. నాన్న ఫిజికల్ డైరెక్టర్. ఆయన అందరినీ లెక్చరర్లుగా చేయాలనుకున్నారు. కానీ నన్ను జడ్జిగా చూడాలన్నది అమ్మ కోరిక. నా మొదటి గురువు ఆమే. ఏం చేయాలి.. ఎలా వెళ్లాలి.. ఎక్కడైతే పడిపోతామో అక్కడే లేచి నిలబడమని చెప్పేది.. అంత సపోర్ట్ ఉండడంతో ఆమె కల నెరవేర్చగలిగాను.
Comments
Please login to add a commentAdd a comment