
ఉత్తమ ఫలితాలు సాధిస్తే ప్రోత్సాహకాలు
నేలకొండపల్లి: ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తానని మెదక్ ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలి పారు. ఆయన స్వగ్రామమైన మండలంలోని రామచంద్రాపురానికి శనివారం వచ్చారు. ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన కేశా నవ్యకు గ్రామస్తులు రూ.1.40 లక్షల బహుమతి ప్రకటించగా ఆయన అందజేసి మాట్లాడారు. రానున్న పరీక్షల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు రూ.10 వేల నగదు బహుమతులు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.వెంకటేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, ఎల్.వెంకట్రాంరెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, డి.వీరారెడ్డి, డి.గోవిందరెడ్డి, పి.లక్ష్మీనారాయణ, ఏడుకొండలు, బైరం దినేష్ కుమార్, కేశా సత్యనారాయణ, మధారమ్మ, ఉపేందర్, విక్రమ్ పాల్గొన్నారు.
సాగునీటి విషయంలో ఇరువర్గాల ఘర్షణ
వైరారూరల్: మండలంలోని ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి తరలింపు లో లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వెంగళ కృష్ణ, ఆయకట్టు రైతు ఎనిక కోటేశ్వరరావు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గత నెల 22న రైతు కోటేశ్వరరావు పథకం పరిధిలో లేని మరో ఐదెకరాలకు సాగునీరు పెట్టుకున్నాడని చైర్మన్ కృష్ణ నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో అదేరోజు కృష్ణ వైరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత శనివారం లిఫ్ట్ పరిధిలో రైతులు చెల్లించాల్సిన డబ్బు తీసుకురావాలని పుణ్యపురానికి చెందిన గద్దె వసంతరావును పంపించి, కృష్ణ సైతం వెళ్తుండగా కోటేశ్వరరావు, రాధిక అడ్డుకుని కులం పేరుతో దూషించి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయాన రాధిక సైతం తన భర్తను కృష్ణ కొట్టాడని ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇంటి స్థల విషయమై...
కారేపల్లి: ఇంటి స్థల విషయమై కారేపల్లిలో శనివారం ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 163లో రెండు గుంటల ఇంటి స్థలం వాంకుడోతు హీరామణి పేరుతో రిజిస్ట్రేషన్ కాగా, సర్వే నెంబర్ 172లో పది గుంటల ఇంటి స్థలం రమాదేవి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. అయితే, రెండు గుంటల ఇంటి స్థలం తమదంటే తమదని ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఈక్రమంలో ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు చేరుకుని సర్దిచెప్పారు. ఏదైనా సమస్య ఉంటే న్యాయపరంగా పరిష్కరించుకోవాలే తప్ప ఘర్షణలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉత్తమ ఫలితాలు సాధిస్తే ప్రోత్సాహకాలు
Comments
Please login to add a commentAdd a comment