రైల్వే బోర్డు చైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో ఆయనతో భేటీ అయిన ఎంపీ ఇక్కడ రైల్వే సమస్యలను ప్రస్తావించారు. పలు స్టేషన్ల ఆధునికీకరణ, ప్లాట్‌ఫాంల విస్తరణ, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, ఇంకొన్ని స్టేషన్లలో హాల్టింగ్, కొత్త రైళ్ల మంజూరుపై చర్చించారు. ఈమేరకు సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని ఎంపీ రవిచంద్ర తెలిపారు.
ఆయిల్‌పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయండి
ఖమ్మంవన్‌టౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విస్తృతంగా ఉన్నందున కేంద్రప్రభుత్వం ఆధ్వర్యాన ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండగా, ప్రస్తుతం 91,200హెక్టార్లలో ఉన్న సాగును ఏటా 40వేల హెక్టార్ల మేర విస్తరించాలనే లక్ష్యం ఉందని తెలిపారు. సుస్థిర వ్యవసాయానికి మద్దతు ఇస్తూనే నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈనేపథ్యాన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ ఆధ్వర్యాన ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఎంపీ వెల్లడించారు.
లైబ్రరీ భ వనానికి రూ.2 కోట్లు
ఖమ్మంగాంధీచౌక్: జిల్లా కేంద్ర గ్రంథాలయ అదనపు భవన నిర్మాణానికి సోమవారం రూ, 2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్‌కు ఆనుకుని ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అదనపు నిర్మాణాలకు రూ.2.80 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించగా ఖమ్మం ఎమ్మెల్యే అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.80లక్షలు కేటా యించారు. మిగతా రూ.2 కోట్లను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మంజూరు చేసింది. కాగా, జిల్లా లైబ్రరీ పాత పురాతన భవనం శిథిలమై 2024 జనవరి 13న కూలిపోయింది. కూలిన భవనం పక్కన మరో భవనం ఉన్నా పూర్తిస్థాయిలో సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పరిపాలనా విభాగాన్ని ఖమ్మం పాత మున్సిపాలిటీ భవనంలోకి మార్చారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో నూతన భవనాలు నిర్మించనుండగా ఇక్కట్లు తీరనున్నాయి.
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం
ఖమ్మం సహకారనగర్: ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలు ఓ పక్క కొనసాగుతుండగానే ఇప్పటికే పూర్తయిన పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుపెట్టా రు. ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఏర్పాటుచేయగా వివిధ జిల్లాల నుంచి 20వేలకు పైగా సంస్కృతం జవాబుపత్రాలను పంపించారు. తొలిజు 24మంది అధ్యాపకులతో పాటు ఇద్దరు చీఫ్ ఎగ్జామినర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జామినర్లు విధులు నిర్వర్తించారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 15జవాబుపత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
398 మంది గైర్హాజరు
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని డీఐ ఈఓ రవిబాబు తెలిపారు. మొత్తం 17,078 మంది విద్యార్థుల్లో 398మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతీ గదిలో గోడ గడియారాలు ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు.
విద్యుత్ ప్రమాదాల
నివారణకు ప్రచారం
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత ప్రమాదాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ల వారీగా ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారుల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు సొంతంగా మరమ్మతు చేయకుండా సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే పరిష్కరిస్తామంటూ వివరిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment