కార్మికుల కష్టం కాజేస్తున్నారు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిబంధనల ప్రకారం కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాల్లో కాంట్రాక్టర్ కోత విధిస్తున్నాడు. ఇదేమిటని అడిగితే విధుల నుంచి తొలగిస్తాడనే భయంతో పనిచేయాల్సి వస్తోందని కలెక్టరేట్‌లో క్లీనింగ్ సెక్షన్ కార్మికులు చెబుతున్నారు. ‘ఎంత వేతనం వస్తుంది’ అని కలెక్టర్ అడిగినా నోరు విప్పలేని పరిస్థితి ఎదుర్కొంటున్న వారి సమస్యలపై సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో భారత కార్మిక సంఘాల కేంద్రం(టీయూసీఐ) నాయకులు ఆవుల అశోక్, పుల్లయ్య, కె.శ్రీను కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
వేతనాల్లో కోత.. అడిగితే బెదిరింపులు
కలెక్టరేట్‌లో క్లీనింగ్ కోసం ఏటా టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన వారికి అప్పగిస్తున్నారు. ఈ ఏడాది మహబూబాబాద్‌కు చెందిన సాయినాథ్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ దక్కగా 20 మంది వరకు సూపర్‌వైజర్లు, వర్కర్లు పనిచేస్తున్నారు. సూపర్‌వైజర్‌కు రూ.19,500, వర్కర్‌కు రూ.15,600 వేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించాలి. కానీ వర్కర్‌కు రూ.7వేలు, సూపర్‌వైజర్‌కు రూ.14వేలే ఇస్తుండడంతో ఒక్కొక్కరు రూ.5వేల మేర ప్రతీనెలా నష్టపోతున్నారు. ప్రతిరోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉండగా మంత్రుల సమీక్షలు, ఇతర సమావేశాలు ఉన్నప్పుడు అదనంగా పనిచేస్తున్నా లాభం ఉండడం లేదని చెబుతున్నారు. అంతేకాక తమకు రావాల్సినంత చెల్లించాలని కాంట్రాక్టర్‌ను అడిగితే పనిలో నుంచి తీసే స్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు. ఈమేరకు ప్రజావాణిలో టీయూసీఐ నాయకులు ఆవుల అశోక్, పుల్లయ్య, కె.శ్రీను తదితరులు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేసి గత మార్చి నుంచి ఇప్పటి వరకు వర్కర్లకు రావాల్సిన వేతనాలు ఇప్పించాలని కోరారు. ఈ విషయమై ఏఓ అరుణను వివరణ కోరగా మంగళవారం విచారణకు హాజరు కావాలని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యులను సమాచారం ఇచ్చామని, విచారణలో తేలే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కలెక్టరేట్‌లో క్లీనింగ్ ఏజెన్సీ
బాధ్యులపై ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment