ఆశల పల్లకిలో..
పెండింగ్ పనులకు నిధులు, కొత్త పథకాల అమలు, వీటి కోసం అర్హుల ఎదురుచూపులు... ఇలా ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌లో తమ కలలు సాకారం అవుతాయా.. అని ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో పనులకు కావాలి ్సన నిధులపై నివేదికలతో హైదరాబాద్ పయనమయ్యారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఉమ్మడి జిల్లాకు ఈ సారి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు దండిగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
రూ.19వేల కోట్లలో ఎంత?
ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే సీతారామ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.19,324 కోట్లకు ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఎంత మేర నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయిస్తారో తేలాల్సి ఉంది. భారీగా నిధులు వస్తేనే ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమయ్యే అవకాశముంది. ఇప్పటివరకు భద్రాద్రి జిల్లాలో ప్రధాన కాల్వ 104 కి.మీ. మేర పూర్తికాగా. భూసేకరణ, అటవీ అనుమతుల జాప్యంతో వైరా, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాల్లో పనులు పెండింగ్ ఉన్నాయి.
పర్యాటకంపై మరింత దృష్టి
గత బడ్జెట్‌లో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న కనకగిరి గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి పేర్కొనగా.. ఎకో టూరిజం పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యాన ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు మహర్దశ వస్తుందని భావిస్తున్నారు. తద్వారా నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం, భద్రాచలం, ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వరాలయం తదితర పుణ్యక్షేత్రాలు కూడా నూతన శోభను సంతరించుకునే అవకాశముంది.
రేషన్ కార్డులు, ఇళ్ల కోసం
కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రజాపాలన సభల్లో ఖమ్మం జిల్లాలో 37,152 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి 26న కొందరితో జాబితా విడుదల చేసినా మిగతా కార్డుల జారీపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే, మండలానికి ఒక్కో గ్రామంలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. దీంతో తమకు ఎప్పుడు అందుతాయని మిగతా గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
సమస్యల జాబితా చాంతాడంత
●గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీపీలకు నిధులు కేటాయిస్తే మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. ఉమ్మడి జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, ఖమ్మంలో యూనివర్సిటీ, నియోజ కవర్గాల్లో కళాశాలల ఏర్పాటు, ప్రాజెక్టులు తదితర సమస్యలకూ ఈ సమావేశాల్లో పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు. ఇక కొత్త మండలాల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు.
●ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే మురుగునీటి సమస్య పరిష్కారమై పారిశు ద్ధ్యం మెరుగుపడుతుంది. ఖమ్మంలో యూజీడీ నిర్మాణానికి రూ.1,200 కోట్ల కేటాయింపుపై ఈ బడ్జెట్‌లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు.
●సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన సింగరేణి గనుల నుంచి బొగ్గులోడింగ్ ఏర్పాటు చేసిన సైలో బంకర్‌తో అంబేద్కర్ నగర్, బీసీ కాలనీ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బంకర్‌ను తొలగించాలని దీక్షలు చేపట్టిన నేపథ్యాన సమస్య త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
●నాగార్జునసాగర్ కెనాల్‌కు మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధిలోని భూములు ఆయకట్టుకు చివరలో ఉన్నాయి. దీంతో సాగునీరు అందని కారణంగా దీన్ని జోన్–3 నుంచి జోన్–2లోకి మార్చేందుకు రూ.800 కోట్లతో వైరా, కట్టలేరు నదులపై ఆనకట్టలు నిర్మించి ఎత్తిపోతల ద్వారా ఈ రెండు మండలాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదన ఉంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధిర నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు. అలాగే, మధిరలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
●ఖమ్మంరూరల్ మండలం ఎం.వీ.పాలెం కేంద్రంగా కొత్త మండలం చేయాలన్న డిమాండ్ ఉంది. కూసుమంచి మండలం పాలేరుకు ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైనా ఏర్పాటు కాలేదు. అలాగే బీచురాజుపల్లి వద్ద ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మాణంలో పట్టాభూమి కోల్పోతున్న వారు మార్కెట్ ధర ప్రకారం పరిహారం డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌పై
ఉమ్మడి జిల్లా వాసుల్లో ఆసక్తి
సీతారామ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యతపై అంచనా
పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తారని భావన
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు,
ఇతర పథకాలకు ఎదురుచూపులు
భారీగా నిధులు సాధిస్తామంటున్న ఎమ్మెల్యేలు
ఆశల పల్లకిలో..
ఆశల పల్లకిలో..
ఆశల పల్లకిలో..
ఆశల పల్లకిలో..
Comments
Please login to add a commentAdd a comment