ఖమ్మం అంతటా యూజీడీ!
● రూ.1,200 కోట్లతో 900 కి.మీ. నెట్‌వర్క్‌కు ప్రతిపాదనలు ● అమృత్–2.0 కింద రూ.249 కోట్లతో తొలిదఫా నిర్మాణం ● నేడు 9.5 కి.మీ. పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలో నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఓపెన్ డ్రెయినేజీలతో పారిశుద్ధ్య లోపం ఎదురవుతుండగా సగానికి పైగా కార్మికులను డ్రెయినేజీలను శుభ్రం చేయడానికే కేటాయించాల్సి వస్తోంది. దీంతో అధికారులు, పాలకులు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను ప్రభుత్వానికి సమర్పించారు. నగరంలో 900 కి.మీ. మేర యూజీడీ నిర్మాణానికి రూ.1,200 కోట్లు అవసరమని అందులో పొందుపర్చారు.
ఎక్కడా మురుగు కనిపించకుండా..
ఖమ్మం నగరమంతా యూడీజీ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. ఇది కార్యరూపం దాలిస్తే ఇళ్ల నుంచి మురుగునీరు, వ్యర్థాలు యూజీడీలోకి చేరేలా కనెక్షన్ ఇస్తారు. ఆపై మురుగునీటి శుద్ధీకరణ కోసం ఏడు ఏస్టీపీ(సేవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లు నిర్మిస్తారు. తద్వారా నగరంలోని 60 డివిజన్ల పరిధిలో ఎక్కడా ఓపెన్ డ్రెయినేజీ ఉండదని చెబుతున్నారు. కాగా, ఎస్టీపీల్లో శుద్ధి చేశాక ఆ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించడంతో పాటు మిగిలితే మున్నేటిలోకి వదలనున్నారు.
నేడు శంకుస్థాపన
మహానగరాలకు దీటుగా విస్తరిస్తున్న ఖమ్మంలో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాటే పారిశుద్ధ్య సమస్య పెరుగుతుండగా అమృత్–2.0 ద్వారా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ)ని నిర్మాణానికి ఏర్పాట్లుచేశారు. తొలిదశలో రూ.249 కోట్ల నిధులతో 9.6 కి.మీ. మేర నిర్మించే యూజీడీ పనులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేస్తారు. యూజీడీతో పాటు రెండు ఎస్టీపీల నిర్మాణానికి సైతం ఆయన శంకుస్థాపన చేయనుండగా, పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఖానాపురం ఊర చెరువు నుండి
ధంసలాపురం వరకు..
యూజీడీ నిర్మాణం ఖానాపురం ఊర చెరువు వద్ద మొదలవుతుంది. ఊర చెరువులో మురుగునీరు కలవకుండా కనెక్టింగ్ పాయింట్ ఏర్పాటుచేస్తారు. అక్కడ నుండి బైపాస్ రోడ్డు, లకారం చెరువు–మినీ లకారం చెరువుల మధ్య నుండి ధంసలాపురం చెరువు మీదుగా మున్నేరు వరకు నిర్మిస్తారు. ఇందులోకి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రెండు ఎస్టీపీలు నిర్మించనున్నారు. ధంసలాపురం చెరువు వద్ద 44 ఎంఎల్‌డీల సామర్థ్యంతో, పుట్టకోట చెరువు వద్ద 9.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో వీటి నిర్మాణం చేపడుతారు. యూజీడీతో పాటు ఈ రెండు ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే నగరంలో మురుగు సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. ఇక గోళ్లపాడు చానల్ ఆధునికీకరణలో భాగంగా నిర్మించిన యూజీడీకి సంబంధించి శ్రీనివాసనగర్ ప్రాంతంలో ఎస్టీపీ పూర్తయితే మురుగునీరు మున్నేరులో కలవకుండా అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
నీటి కలుషితం కావొద్దనే..
ప్రస్తుతం నగరంలో గృహాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుండి వస్తున్న మురుగు నీరు నేరుగా చెరువులు, మున్నేరులో కలిసి అందులోని నీరు కలుషితమవుతోంది. తద్వారా భవిష్యత్‌లో భూగర్భ జలాలు కలుషితతమయ్యే ప్రమాదముంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అధికారులు ఖమ్మంలో యూజీడీ నిర్మాణానికి సిద్ధమయ్యారు. చెరువులు, మున్నేరులో మురుగు నీరు కలవకుండా అడ్డుకునేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును పూర్తిచేసి దశల వారీగా మిగతా చోట్ల కూడ నిర్మిస్తే భవిష్యత్‌లో నగరవాసులకు ఓపెన్ డ్రెయినేజీ ఎక్కడ కానరాదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment