తొలిసారి తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి చరిత్రలోనే తొలిసారి తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. కారేపల్లి మండలం ఎర్రబోడు మాణిక్యారానికి చెందిన గడిబోయిన వెంకటేశ్వర్లు చాన్నాళ్లుగా తుంటి నొప్పితో ఇబ్బంది పడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో సంప్రదిస్తే కీలు మార్పిడికి రూ.3 లక్షలు అవుతుందని చెప్పారు. నలుగురు కుమార్తెల తండ్రి అయిన ఆయన అంత వెచ్చించలేక, హైదరాబాద్ వెళ్లలేక ఖమ్మం పెద్దాస్పత్రిలో సంప్రదించాడు. దీంతో వైద్యులు ఆయన ‘ఎవాస్క్యూలర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమొరల్ హెడ్’తో బాధపడుతుండగా రెండు తుంటి కీళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈమేరకు తుంటి కీలు మార్చి ‘అన్ సిమెంటెడ్ టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్’ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రొఫెసర్లు ఎల్.కిరణ్‌కుమార్, హనుమాన్‌సింగ్, అసిస్టెంట్ ప్రొఫె సర్లు వినయ్‌కుమార్, మదన్‌సింగ్, అనస్తీషియన్ రవి, అసోసియేట్ ప్రొఫెసర్ యుగంధర్ ఆధ్వర్యాన ఆపరేషన్ చేయగా వెంకటేశ్వర్లు రెండో రోజునే వాకర్ సాయంతో నడక ప్రారంభించాడు. మరో పది రోజుల్లో ఇంకో తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నామని వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.6లక్షల వ్యయమయ్యే ఈ చికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందింది. వైద్యులను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త కిరణ్‌కుమార్, ఆర్‌ఎంఓ రాంబాబు, వినాయక్ రాథోడ్ అభినందించారు.
విజయవంతంగా పూర్తిచేసిన పెద్దాస్పత్రి వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment