అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత
తమిళనాడు జైలులో పరిచయంతో కలిసి దోపిడీలు
● వైరాలో దోచుకున్నాక కర్ణాటకలోనూ చోరీ ● రూ.37 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
వైరా: వివిధ నేరాలకు పాల్పడిన వారు తమిళనాడు జైలులో శిక్ష అనుభవించారు. అయితే, బెయిల్‌పై బయటకు వచ్చాక సైతం వారి స్నేహం కొనసాగింది. జల్సాల కోసం ఒకరు.. చేసిన అప్పులు తీర్చేందుకు మరొకరు చోరీలకు పాల్పడే వారు పాత అలవాట్లు మానుకోలేక మళ్లీ దొంగతనాలనే ఎంచుకున్నారు. అడ్డొస్తే ప్రాణాలు సైతం తీసేందుకు వెనకడుగు వేయని నైజం కలిగిన వారు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఈమేరకు వైరాలో వృద్ధురాలు ఒంటరిగా ఉండడాన్నిగమనించి వారి ఇంట్లో గతనెల 12న చోరీ చేసిన ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వీరి వివరాలను మంగళవారం వైరాలో పోలీసు కమిషనర్ సునీల్‌దత్.. ఏసీపీ ఎం.ఏ.రెహమాన్‌తో కలిసి వెల్లడించారు.
అందరినీ కలిపింది జైలు...
ఏపీలోని పల్నాడు జిల్లా పోరేటిపాడుకు చెందిన రాయపాటి వెంకయ్య అలియాస్ దొంగల వెంకన్న, అదేజిల్లా దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన షేక్ నాగుల్‌మీరా, తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా మాణిక్యంపాలెంకు చెందిన ముత్తు అలియాస్ ముత్తురాజ్, వీరప్పన్ సత్రకు చెందిన విజయ్ అలియాస్ విజయ్‌కుమార్‌కు తమిళనాడులోని జైలులో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వివిధ నేరాలపై వెళ్లిన క్రమాన ఏర్పడిన పరిచయాన్ని బయటకు వచ్చాక కొనసాగించారు. ఈక్రమంలో ముఠాగా ఏర్పడిన వారు అధికారుల పేరిట తనిఖీలకు వెళ్లి దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే గతనెల 12న వైరాలోని సుందరయ్య నగరలో వృద్ధురాలు శీలం వెంకట్రావమ్మ ఒంటరిగా ఉందని గుర్తించారు. దీంతో నలుగురు కారులో వచ్చి పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఓ వ్యక్తికి ధరంచి వెంకట్రామ్మ ఇంటిలోకి వెళ్లి ఆమె కొడుకు గంజాయి అమ్ముతున్నాడని, ఇంట్లో సోదాలు చేయాలని చెబుతూ లోనకు ప్రవేశించారు. ఆపై వృద్ధురాలిని బంధించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారు వాడిన కారు, వచ్చివెళ్లిన రహదారులపై సీసీ పుటేజీల సాయంతో తెలంగాణ, ఏపీలో గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే నలుగురు మరోమారు కారులో వస్తుండగా వైరా మండలం దాచాపురం సమీపాన తనిఖీల్లో పోలీసులకు మంగళవారం పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.
నాలుగు రాష్ట్రాల్లో కేసులు
ఈ కేసులో పట్టుబడిన రాయపాటి వెంకన్నపై తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిపి 30 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. మరో నిందితుడు షేక్ నాగులు మీరాపై ఏపీ, కర్ణాటకలో 10 కేసులు ఉండగా, ముత్తుపై తమిళనాడు, కర్ణాటకలో 11, విజయ్‌పై తమిళనాడులో నాలుగు కేసులు ఉన్నాయని చెప్పారు. ఇందులో హత్య కేసులు కూడా ఉండడం గమనార్హం. కాగా, వైరాలో దోపిడీ అనంతరం ఫిబ్రవరి 16న విజయవాడలో కారు కిరాయి తీసుకుని 22వ తేదీన కర్ణాటక చేరుకున్నారు. అక్కడ వెంకన్న, నాగుల్‌మీరా, ముత్తు ఓ ఇంటికి వెళ్లి పౌర సరఫరాల శాఖ ఉద్యోగులుగా చెబుతూ కత్తులతో బెదిరించి 120 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. కాగా, వైరాతో పాటు కర్ణాటక చోరీ చేసిన ఆభరణాలు కలిపి రూ.37లక్షల విలువైన ఆభరణాలే కాక రెండు కార్లు, వేట కొడవళ్లు, గడ్డపార వంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. కాగా, కేసు విచారణకు వైరా ఏసీపీ రహమాన్ ఆధ్వర్యాన సీఐ నునావత్ సాగర్ నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేయడమేకాక చోరీ సొత్తు రికవరీచేసిన సీఐ సాగర్, వైరా తల్లాడ, కొణిజర్ల ఎస్సైలు భాగ్యరాజ్, కొండలరావు, సూరజ్, ట్రెయినీ ఎస్‌ఐలు పవన్, వెంకటేష్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లకు సీపీ రివార్డులు అందజేశారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment