ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లిలోని జిల్లా మహిళా ప్రాంగణంలో నిరుపేద యువతులు, మహిళలకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనుండగా, దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రాంగణం అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 – 45 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలకు ఉచిత భోజన, వసతితో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. టైలరింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్, కారు, ఆటో డ్రైవింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్‌లో రెండు నెలల నిడివితో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కోర్సుల వారీగా ఎనిమిదో తరగతి మొదలు ఎస్సెస్సీ, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని, డ్వాక్రా గ్రూప్‌ల సభ్యులకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్ కాపీలు జతపరిచిన దరఖాస్తులను ఈనెల 31లోగా మహిళా ప్రాంగణంలో అందజేయాలని, శిక్షణ పూర్తయ్యాక రాయితీతో కూడిన రుణాలు ఇప్పిస్తామని విజేత తెలిపారు.
ఏదులాపురం కమిషనర్‌గా శ్రీనివాసరెడ్డి
ఖమ్మం రూరల్: ఇటీవల ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా ఆళ్ల శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జ్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆతర్వాత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, శ్రీనివాసరెడ్డి గతంలో జిల్లాలోని వివిధ మండలాల ఎంపీడీఓగా, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్‌గా, పెద్దతండా పంచాయతీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తు తం డీఆర్‌డీఏ డీపీఎం(ఫైనాన్స్)గా పనిచేస్తున్న ఆయనను ఏదులాపురం మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు.
రాజీవ్ యువవికాసం
పథకానికి దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికా సం పథకానికి గిరిజన నిరుద్యోగ యువత ఏప్రిల్ 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్.విజయలక్ష్మి తెలిపారు. షెడ్యూల్ తెగల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిందని వెల్లడించారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు https://tgobmmsnew.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
బీసీ గురుకులాల్లో ప్రవేశానికి ఏప్రిల్ 20న పరీక్ష
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల్లో వచ్చే విద్యాసంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఏప్రిల్ 4న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీ గురుకుల విద్యాసంస్థల ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి సీహెచ్.రాంబాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 24 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, 6వ తరగతిలో బాలికలకు 249, బాలురకు 294, 7వ తరగతిలో బాలికలకు 170, బాలురకు 177, 8వ తరగతిలో బాలికలకు 97, బాలురకు 124, 9వ తరగతిలో బాలికలకు 139, బాలురకు 184 బ్యాక్‌లాగ్ సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రవేశాలకు రూ.150 చెల్లించి ఈనెల 31లోగా https://mjptbcadmissions.org/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.
మత్స్యకారులకు
శిక్షణ ప్రారంభం
కూసుమంచి: కూసుమంచి మండలంలోని పాలేరు పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన ఎస్టీ మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ చేపల పెంపకంలో పద్ధతులు, చేపల సంరక్షణ, దాణా తయారీపై అవగాహన కల్పించారు. అనంతరం జుజుల్‌రావుపేట, నాచేపల్లిలోని ఫిషరీస్ కేంద్రాలను తీసుకెళ్లి వివిధ రకాల చేపలు, రొయ్యల పెంపకం తీరును వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment