
రైతుల భూములకు భరోసా
● సమస్యల సత్వర పరిష్కారానికే ‘భూ భారతి’ ● అవగాహన సదస్సులో ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీజ
నేలకొండపల్లి: రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి భరోసా కల్పించేందుకే భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనుండగా.. తొలిరోజు నేలకొండపల్లిలో గురువారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో లేని అనేక అంశాలను కొత్త చట్టంలో చేర్చినందున సమస్యల పరిష్కారం సులువవుతుందని తెలిపారు. ఈ మేరకు రైతులు ఎప్పటిలాగే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏటా డిసెంబర్ 31న రికార్డులను అప్‌డేట్ చేయనుండడంతో బ్యాంకులకు వెళ్లినప్పుడు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పనిలేకుండా పోర్టల్‌లోని వివరాల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ పోర్టల్ అమలులో లోటుపాట్లను గుర్తించేందుకు నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున అందరూ అవగాహన పెంచుకుని సహకరించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా... పలువురు రైతులు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి నరసింహారావు, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు శాఖమూరి రమేష్, భద్రయ్య, యడవల్లి సైదులు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, కడియాల నరేష్, గుండా బ్రహ్మం, మేకల వెంకటేశ్వర్లు, ఈవూరి శ్రీనివాసరెడ్డి, చిలకబత్తిని వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
నాచేపల్లిలో 112 దరఖాస్తులు
భూ భారతి చట్టం అమలుకు నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యాన రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు ప్రారంభించారు. తొలిరోజు నాచేపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన సదస్సును ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ప్రారంభించి కొత్త చట్టంతో ప్రయోజనాలను వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతులు పలు సమస్యలపై 112 దరఖాస్తులు అందించారు. ఇందులో సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం 36, పట్టా ప్రకారం భూమి తరుగు ఉందని 33 మంది దరఖాస్తు చేయగా, మిగతావి పేరు మార్పిడి, నంబర్లలో తప్పులు, కొత్త పాసుపుస్తకాల కోసం అందాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరి, ఆర్‌డీఓ నరసింహారావు, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రైతుల భూములకు భరోసా