
తెలంగాణలోనే సన్నబియ్యం
● రేషన్‌షాపుల్లో ఇస్తున్న ఘనత మనదే.. ● లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మంత్రి తుమ్మల, అధికారులు
రఘునాథపాలెం: రేషన్‌షాప్‌ల ద్వారా తెలంగాణలో మాత్రమే పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో సన్నబియ్యం లబ్ధిదారుడు గుడిబండ్ల రాజారావు ఇంట్లో పోలీసు కమిషనర్ సునీల్‌దత్, ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంత్రి శనివారం భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పేదలు సన్నబియ్యం కొనలేక ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం రేషన్‌షాప్‌ల ద్వారా ఉచితంగా ఇస్తుండడంతో అందరూ సంతృప్తిగా భోజ నం చేస్తున్నారని తెలిపారు. అంతేకాక రేషన్ బియ్యం రీసైక్లింగ్‌కు అడ్డుకట్ట పడినట్లయిందని వెల్లడించారు. కాగా, సన్నధాన్యానికి మద్దతు ధరకు తోడు రూ.500 బోనస్ ఇస్తుండడంతో సాగు పెరిగిందని తెలిపారు. అంతకుముందు బూడిదంపాడు–పుటానితండా జెడ్పీ రోడ్డు నుంచి వాంకుడోతు తండా రోడ్డు వరకు రూ.2.5 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, బూడిదంపాడు ఎస్సీ కాలనీలో రూ.80 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి బూడిదంపాడు వరకు రూ.1.5 కోట్లతో నిర్మించే అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు.
మూడు నెలల్లో రైతుబజార్
మండలంలోని మంచుకొండలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్మిస్తున్న రైతు బజార్‌ను మూడు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సింజెంటా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)గా కేటాయించిన నిధులతో రైతు బజార్, పీహెచ్‌సీలో అదనపు నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండలంలో పేద, గిరిజన రైతులు పండించిన కూరగాయలను ఇక్కడే విక్రయించుకునేలా రైతుబజార్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యాకూబ్, ఈఈ యుగంధర్, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డీఏఓ పుల్లయ్య, విద్యుత్‌శాఖ డీఈ రామారావు, డీఎల్‌పీఓ రాంబాబు, సింజెంటా కంపెనీ డైరెక్టర్ వైద్యనాధ్, కేశవులు, జే.వీ.మోహన్‌రావుతో పాటు తుమ్మలపల్లి నాగేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పల్లెబోయిన చంద్రం, సాధు రమేష్‌రెడ్డి, మానుకొండ రాధాకిషోర్, వాంకుడోత్ దీపక్, దిరిశాల వెంకటేశ్వర్లు, తాతా రఘురాం, విజయాబాయి, చోటాబాబా, కొదుమూరి మధు, నల్లమల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.