
రగ్బీలో రాణిస్తున్న అభినయశ్రీ
● సీనియర్స్ జాతీయస్థాయి జట్టుకు ఎంపిక ● గతంలో కరాటే, వాలీబాల్ పోటీల్లోనూ ప్రతిభ
ముదిగొండ: చిన్నతనం నుంచి ఆమెకు క్రీడలపై మక్కువ. ఓ పక్క ఆటల్లో సాధన చేస్తూనే చదువులోనూ ప్రతభ కనబర్చడం అలవాటుగా మార్చుకుంది. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న ఆమె పలువురి మన్ననలు అందుకుంటోంది. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన చల్లగొండ్ల అభినయశ్రీ ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం కేజీబీవీలో ఇంటర్ పూర్తి చేసింది. ఆరో తరగతి నుంచి కరాటే నేర్చుకున్న ఆమె జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. గోవాలో నేషనల్ యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన జరిగిన పోటీల్లో బంగారు పతకాలు, బ్లాక్ బెల్ట్ సాధించింది. కేజీబీవీ ప్రత్యేకాధికారి ఇందిర, సీఈటీ నిర్మల ప్రోత్సాహంతో వాలీబాల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించడం విశేషం.
రగ్బీలోనూ ప్రతిభ
కరాటే, వాలీబాల్‌లోనే కాక రగ్బీపైనా అభినయశ్రీ దృష్టి సారించింది. ఈమేరకు జూనియర్స్ విభాగం నుంచి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికై ంది. పుణెలోని బల్లెవాడిలో గత ఏడాది జూలైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. అలాగే, అసోం రాష్ట్రంలోని గువాహటిలో సీనియర్స్ విభాగంలో జరగనున్న జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై న ఆమె పలువురి మన్ననలు అందుకుంటోంది.