మామిడి.. లేదు రాబడి.. | - | Sakshi
Sakshi News home page

మామిడి.. లేదు రాబడి..

Published Tue, Apr 22 2025 12:25 AM | Last Updated on Tue, Apr 22 2025 12:25 AM

మామిడ

మామిడి.. లేదు రాబడి..

మామిడి రైతులకు దెబ్బ మీద దెబ్బ
● తొలుత తెగుళ్లు.. ఇప్పుడు గాలిదుమారం, అకాల వర్షం ● కోత సమయాన కాయలు నేలరాలడంతో తీవ్ర నష్టం ● నాణ్యత తగ్గి పడిపోతున్న ధర

తల్లాడ: ఈ ఏడాది మామిడి రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కోలుకోలేని నష్టం వాటిల్లింది. సాధారణంగా మేలో చెడు గాలులు, వానలు వస్తాయి. ఈసారి ఏప్రిల్‌ మొదటి వారం నుంచే అకాల వర్షం, గాలిదుమ్ములు వచ్చాయి. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. కోతకొచ్చిన తరుణంలో అకాల వర్షం, పెను గాలుల కారణంగా మామిడి కాయలు నేల రాలాయి. ఈ నెలలో 3, 13, 15, 20 తేదీల్లో రాత్రి గాలి, వాన రావడంతో మామిడి కాయలు నేలరాలాయి. నాలుగు సార్లు గాలి, వాన రావడంతో కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడి కాయల్లో 30 నుంచి 40 శాతానికి పైగా కాయలు రాలిపోయాయి. గాలిదుమ్ము రాక ముందు టన్ను రూ.40 వేల నుంచి రూ.60 వేలు పలకగా ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు టన్ను ధర ఉంది. కాయ నాణ్యతను బట్టి ధర మారుతోంది. ఇక్కడి నుంచి మామిడికాయలను ముంబై, నాగ్‌పూర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తుంటారు.

సత్తుపల్లిలో అత్యధికం

జిల్లాలో 32 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవగా.. సత్తుపల్లి నియోజకవర్గంలోనే 20 వేల ఎకరాల్లో తోటలు ఉంటాయి. నెలలో నాలుగు సార్లు వచ్చిన గాలి, వాన కూడా సత్తుపల్లి నియోజక వర్గంలోని కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, తల్లాడ మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపటంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈనెలలో మామిడి కోతలు ప్రారంభమై మే నెలాఖారుతో ముగుస్తాయి. అంతకుముందు అధిక మంచు వల్ల పూత రాలింది. పూత నిల్వడం కోసం రైతులు ఐదు నుంచి పది సార్లు మందులు స్ప్రే చేశారు. తద్వారా ఎకరానికి రూ.20 వేల మేర పెట్టుబడి అయింది. తర్వాత మంగు తెగులు కారణంగా కొంత నష్టం జరిగింది.

కౌలు రైతులకు తీరని నష్టం

ఈ ఏడాది కౌలు రైతులకు తీరని నష్టం జరిగింది. ఎకరానికి రూ.20 నుంచి రూ.30 వేల వరకు కౌలుకు తీసుకోగా కాయలు రాలడంతో కోలుకోలేని దెబ్బ తిన్నారు. 5 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్న వారు రూ.లక్షకు పైగా నష్టపోయారు.

నష్టపరిహారం చెల్లించాలి

గాలి వానతో నష్టపోయిన మామిడి పంట నష్టం అంచనా వేయాలి. నష్ట పోయన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది నష్టం వాటిల్లింది. పలుమార్లు గాలి, వాన రావడంతో పలు రకాల కాయలు నేలరాలాయి.

–కోడూరు సత్యనారాయణ, కౌలు రైతు, కిష్టాపురం

నష్టం అంచనా వేసి పంపించాం

ఈ నెలలోనే మూడు సార్లు గాలి వాన రావడం వల్ల మామిడి పంటకు నష్టం జరిగింది. మామిడి కాయలు నేల రాలడంతో పగిలిపోయి దెబ్బతిన్నాయి. జిల్లాలో 33 శాతానికి పైగా నష్టపోయిన తోటలను ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాం.

–మధుసూదన్‌, జిల్లా ఉధ్యానశాఖాధికారి

అనుకూలించని వాతావరణం

ఈ ఏడాది వాతావరణం మామిడికి అనుకూలించలేదు. కోతల ప్రారంభంలోనే గాలి దుమ్ములతో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. తీవ్ర నష్టం ఏర్పడింది. మార్కెట్‌లో కూడా టన్ను ధర తగ్గింది. మామిడి రైతులను ఆదుకోవాలి.

–తూము శ్రీనివాసరావు, నూతనకల్‌

మామిడి.. లేదు రాబడి.. 1
1/2

మామిడి.. లేదు రాబడి..

మామిడి.. లేదు రాబడి.. 2
2/2

మామిడి.. లేదు రాబడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement