
ఆలయాల అప్‌గ్రేడ్..
● కొన్నింటికి 6బీ నుంచి 6ఏ హోదా
● మరికొన్ని 6బీ జాబితాలోకి..
పాల్వంచరూరల్: ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను అప్‌గ్రేడ్ చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల తాకిడితో పాటు అదేస్థాయిలో ఆదాయం సమకూరుతోంది. దీంతో ప్రతీ మూడేళ్లకోసారి ఆలయాల ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్న దేవాదాయ శాఖ గ్రేడ్ పెంచుతోంది. తద్వారా భక్తులకు ఆలయాల్లో వసతుల కల్పనతో పాటు సిబ్బంది సంఖ్య పెరిగే అవకాశముంటుంది. ఆదాయం ఆధారంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఏడు ఆలయాలకు 6ఏ హోదా ఉండగా కొత్తగా మరో ఆరింటిని 6బీ నుంచి 6ఏకు అప్‌గ్రేడ్ చేశారు.
6ఏ ఆలయాలు ఇవే..
తాజాగా అప్‌గ్రేడ్ చేసినవి కలిపితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 17ఆలయాలు 6ఏ గ్రేడ్ పరిధిలో ఉన్నాయి. ఇందులో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం, అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తగూడెంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయంతో పాటు జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి, ఖమ్మంరూరల్ మండలం రెడ్డిపల్లి శ్రీమారెమ్మతల్లి ఆలయం, పెనుబల్లిలోని శ్రీనీలాద్రీశ్వరస్వామి, ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి(గుట్ట), కమాన్‌బజార్ శ్రీ వేంకటేశ్వరస్వామి, కాల్వొడ్డులోని సత్యనారాయణ సహిత వీరాంజయనేయస్వామి, వేంసూరు మండలం కందుకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయా లు ఈ జాబితాలో కొనసాగుతున్నాయి. కొత్తగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి, మధిరలోని మృత్యుంజయస్వామి, ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లేశ్వరస్వామి, ఏన్కూరు మండలం గార్లొడ్డు శ్రీలక్ష్మీనర్సింహస్వామి, సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మ తల్లి, ఖమ్మం ఇందిరానగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి(పర్ణశాల) ఆలయాలు అప్‌గ్రేడ్ అయ్యాయి. అలాగే, ముదిగొండ మండలం వల్లాపురం శ్రీ మల్లికార్జునస్వామి, కొణిజర్ల మండలం పల్లిపాడు శ్రీ శంభులింగేశ్వరస్వామి, కూసుమంచి మండలం పెరికసింగారం శ్రీవేణుగోపాల ఆంజనేయస్వామి, ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్ శ్రీ సీతారామాంజనేయ స్వామి, కామేపల్లి మండలం కొత్తలింగాల కోట మైసమ్మ, ఖమ్మం వరదయ్యనగర్‌లోని మైసమ్మ ఆలయాలు 6బీ హోదా పొందాయి. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి శ్రీదాసాంజనేయస్వామి, కొత్తగూడెం బాబూక్యాంప్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి, పాపకొల్లు శ్రీఉమాసోమలింగేశ్వరస్వామి, పాల్వంచలోని శ్రీరామాలయం, అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయాల కు కూడా 6బీ హోదా కల్పించారు.