
వడదెబ్బతో వృద్ధుడు మృతి
తల్లాడ: మండలంలోని మల్లవరంలో మంగళవారం వడదెబ్బ బారిన పడిన వృద్ధుడు మృతి చెందాడు. దళిత కాలనీకీ చెందిన మేడి ఎర్రముత్తయ్య(76) వైరా రిజర్వాయర్ సమీపంలో ఊట వాగు వద్ద పొలంలో వరి సాగు చేశాడు. ధాన్యం కోతల కోసం పొలానికి వెళ్లి వచ్చిన ఆయన వడదెబ్బ బారిన పడగా ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించటంతో మంగళవారం తెల్ల వారుజామున మృతి చెందాడు.
బాజుమల్లాయిగూడెంలో మహిళ...
కారేపల్లి: చేను పనులకు వెళ్లిన మహిళ వడదెబ్బ బారిన పడడంతో మృతి చెందింది. మండలంలోని బాజుమల్లాయిగూడెంకు చెందిన అర్వపల్లి దేవేంద్ర(48) రోజు లాగే సోమవారం చేను పనులకు వెళ్లగా ఎండదెబ్బ తాకడంతో వాంతులయ్యాయి. స్థానికంగా వైద్యం చేయిస్తుండడంతో సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు భర్త శ్రీను, ఇద్దరు కుమార్తెలు ఉండగా, చిన్నకుమార్తె వివాహం మే 9వ తేదీన జరగాల్సి ఉండగా కుటుంబంలో విషాదం నెలకొంది.
డీజే బాక్స్ తలపై పడడంతో మృతి
వేంసూరు: రోడ్డు ప్రమాదాలో ఓ యువకుడు మృతి చెందాడు. వేంసూరు మండలంలో కొండెగట్లలో జరిగే వేడుకకు వ్యాన్‌లో మంగళవారం సత్తుపల్లి మండలం గంగారం నుంచి డీజే బాక్స్‌తో నిర్వాహకులు బయలుదేరారు.మర్లపాడు శివారు మూలమలుపు వద్ద వ్యాన్ అదుపు తప్పిబోల్తా పడగా, తిరుపతి విజయ్(17) తలపై డీజే బాక్స్ పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, వ్యాన్‌లో ఉన్న గుంజ అజయ్, బొమ్మర సాయివర్ధన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, తిరుపతి విజయ్ పదో తరగతి పరీక్షలు రాయగా, ఉపాధి కోసం డీజే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈమేరకు ఘటనపై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరప్రసాద్ తెలిపారు.