
నేడు పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్‌రెడ్డి
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ పి.మోహనమురళి తెలిపారు. ఖమ్మం రోటరీనగర్‌లోని డెయిరీలో జరిగే పాల ఉత్పత్తిదారుల సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. పాల ఉత్పత్తిలో మెళకువలు, విక్రయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలే కాక ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా వివరిస్తామని తెలిపారు. తొలుత ఖమ్మం రైతుబజార్, కొణిజర్లలో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్లను చైర్మన్ ప్రారంభిస్తారని డీడీ పేర్కొన్నారు.
‘వనజీవి’ కుటుంబానికి మాజీ ఎంపీ చేయూత
ఖమ్మం మామిళ్లగూడెం: ఇటీవల మృతి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య దశదినకర్మ గురువారం జరగనున్న నేపథ్యాన ఆయన కుటుంబానికి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తన నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్థికసాయం అందజేశారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని రామయ్య స్వగృహంలో ఆయన సతీమణి జానకమ్మకు బీఆర్‌ఎస్ నాయకులు బెల్లం వేణుగోపాల్, కనకమేడల సత్యనారాయణ నగదు అందజేశారు. నాయకులు పేరం వెంకటేశ్వర్లు, గొడ్డేటి మాధవరావు, వాకాదని కోటేశ్వరరావు, పాల్వంచ రాజేష్, బానోత్ కృష్ణ, శీలం రవికుమార్, ఏపూరి తరుణ్, మేకల ఉదయ్‌కుమార్, ఆలకుంట వెంకటేష్, డి.ఎల్లయ్య, పి.ఎల్లయ్య, డి.బాబు, పి.లక్ష్మయ్య, జి.వెంకటేష్, కళ్లెం సీతయ్య, ఎరపుల రాజా, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ పరిశీలకుల
నియామకం
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలకులను నియమించింది. జిల్లా పరిశీలకులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన నాయకుడు బత్తిని శ్రీనివాస్‌ను నియమిస్తూ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పేరిట బుధవారం ఓ ప్రకటన విడుదలైంది.
25న ఉద్యోగుల
బైక్ ర్యాలీ, సదస్సు
రఘునాథపాలెం: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 25న ఖమ్మంలో నిర్వహిస్తున్న ర్యాలీ, సదస్సును విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు కోరారు. మండలంలోని వేపకుంట్లలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యాన శుక్రవారం సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్ నుంచి టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ ర్యాలీగా వెళ్లనుండగా, అక్కడ సదస్సు ఉంటుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. ఈ సమావేశంలో సతీష్, సక్రాం, శిరీష, ప్రసాద్, శేషగిరి, పాండురాజు, అరుణ, దాసు, శారద, కృష్ణార్జున్ పాల్గొన్నారు.
25న హ్యాండ్‌బాల్
ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: సీనియర్స్ మహిళల విభాగంలో రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ జట్టును ఎంపిక చేసేందుకు ఈనెల 25న పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ సి.రఘునందన్ తెలిపారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే ఈ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డుతో ఉదయం 9గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
భరతనాట్యం
శిక్షణార్థులకు పరీక్ష
ఖమ్మంగాంధీచౌక్: భరతనాట్యంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఖమ్మం వండర్ కిడ్స్ పాఠశాలలో బుధవారం చంఢీగఢ్ యూనివర్సిటీ ఆధ్వర్యాన పరీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లాకు చెందిన కళాకారిణి ప్రతిమా సునీల్ పర్యవేక్షణలో పరీక్ష కొనసాగగా, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.

నేడు పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్‌రెడ్డి