
ఎర్లీబర్డ్‌కు ఏడు రోజులే..
● పన్ను రాయితీపై మున్సిపాలిటీల్లో ప్రచారం అంతంతే ● కేఎంసీలో రూ.5.16 కోట్లకు చేరిన ఆదాయం ● అన్నిచోట్ల దృష్టి సారిస్తే వసూళ్లు పెరిగే అవకాశం
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు రాయితీ ఇచ్చేలా ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఎర్లీబర్డ్ స్కీమ్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీలోగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ అందుతుంది. జిల్లాలో ముందస్తుగా పన్నులు చెల్లించే కొందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గత ఏడాది వరకు వంద శాతం పన్ను చెల్లించిన వారిని అర్హులుగా గుర్తించగా... అసెస్‌మెంట్ల యజమానులు పలువురికి అర్హత ఉన్నా అవగాహన లేక ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం చేస్తే పన్ను చెల్లించే వారి సంఖ్య పెరగడమే కాక పుర, నగర పాలక సంస్థలకు ముందస్తుగా పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది.
కార్పొరేషన్‌లో రూ.5.16 కోట్లు..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎర్లీబర్డ్ స్కీమ్‌కు చెల్లింపుదారుల నుంచి సానుకూల స్పందనే వస్తోంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో బుధవారం నాటికి రూ.5.16 కోట్ల మేర వసూలయ్యాయి. ఈ ఏడాది ఎర్లీబర్డ్ స్కీమ్‌లో రూ.10 కోట్లు వసూలు చేయాలనేది లక్ష్యం కాగా, యాభై శాతం దాటేశారు. మిగిలిన ఏడు రోజుల్లో మరింత శ్రద్ధ వహించి లక్ష్యాన్ని చేరాలనే భావనతో ఉన్నారు.
మున్సిపాలిటీల్లో నామమాత్రంగా..
జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్‌తో పోలిస్తే మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ స్కీమ్‌పై అధికారులు పెద్దగా ప్రచారం చేస్తున్నట్లు కనిపించడంలేదు. తద్వారా పన్నుల వసూళ్లలో 5 నుంచి 10 శాతం కూడా లక్ష్యాలను చేరలేదు. ఈ పథకం ద్వారా ఎక్కువ మొత్తంలో పన్నులు రాబడితే మిగతా సమయంలో లక్ష్యాల సాధన సులువవుతుంది. అంతేకాక యజమానులు ఏటా క్రమం తప్పకుండా పన్ను చెల్లించేందుకు ముందుకొస్తారు. ఈమేరకు అధికారులు స్పందించి మిగిలిన ఏడు రోజులను సద్వినియోగం చేసుకుంటే మున్సిపాలిటీలకు ఆదాయం పెరగనుంది.
కార్పొరేషన్, మున్సిపాలిటీల వారీగా వివరాలు
కార్పొరేషన్ / అర్హత కలిగిన ఎర్లీ బర్డ్ లక్ష్యం ఇప్పటివరకు
మున్సిపాలిటీ అసెస్‌మెంట్లు వసూలు
ఖమ్మం 5,1770 రూ.10కోట్లు రూ.5.16 కోట్లు
సత్తుపల్లి 9,736 రూ.4.61 కోట్లు రూ.51లక్షలు
మధిర 8,804 రూ.2.70కోట్లు రూ.25.50లక్షలు
వైరా 7,113 రూ.2.73కోట్లు రూ.2లక్షలు