![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/30/Thalli-chentaku.jpg.webp?itok=BO3FRxQv)
ఆదిలాబాద్: పద్నాలుగేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలుడు పదహారేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరాడు. చిన్నతనంలోనే దూరమైన కొడుకు ఇక తమకు దొరకడేమోనని నిత్యం కన్నీటి పర్యంతమైన ఆ తల్లికి ఎదిగిన కొడుకు దరిచేరడంతో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శనివారం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజీపూర్ జిల్లా మహ్మదాబాద్ తహసీల్ పరిధిలోని యూసుఫ్‌పూర్ గ్రామానికి చెందిన సంత్రదేవి, మున్నాకుమార్ బింద్ దంపతులకు నలుగురు కుమారులు, కూతురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు మహేందర్ బింద్ అలియాస్ మనోజ్‌ను చిన్నతనంలో దగ్గరి బంధువు ముంబయి తీసుకెళ్లి హోటల్‌లో పనికి కుదిర్చాడు. కొద్ది రోజుల తర్వాత హోటల్‌లో పని మానేసి వెళ్లిపోయాడు.
ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ్‌కుమార్ యాదవ్ అనే యువకుడికి తారసపడ్డాడు. తనదీ అదే రాష్ట్రమని, పని కోసం వెతుకుతున్నానని మహేందర్ బింద్ చెప్పడంతో వెంట తీసుకొచ్చి బెల్లంపల్లిలోని బేకరీలో పనికి కుదిర్చాడు. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తుండగా ఓ రోజు ఇంటిపై ధ్యాస మళ్లి బేకరీ యజమాని సుశీల్‌కుమార్ యాదవ్‌కు తన ఇంటి అడ్రస్ కనుక్కోవాలని కోరాడు. దీంతో సుశీల్‌కుమార్ ఆ రాష్ట్రంలోని తన బంధువులకు చెప్పి ఆరా తీశాడు.
ఘజీపూర్ జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యూసుఫ్‌పూర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వివరాలు ఇచ్చారు. దీంతో తల్లి సంత్రదేవి, బాబాయ్ కమలేష్‌బింద్, పిన్నీ బసంత్ బింద్ శుక్రవారం బెల్లంపల్లికి చేరుకున్నారు.
ఆపరేషన్ చేసిన గాయం చూసి...
కొడుకును వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటొచ్చిన తల్లి అతడిని చూసి ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కొడుకూ కన్నీటి పర్యంతమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నతనంలో గొంతుకింద చేసిన ఆపరేషన్ గాయాన్ని పరిశీలించి మహేందర్ బింద్ తన కొడుకేనని సంత్రదేవి మురిసిపోయి ముద్దాడింది. కుటుంబసభ్యులను కలిసేలా చేసిన బేకరీ షాప్ యజమాని సుశీల్ కుమార్‌యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్ బింద్ తల్లి, బంధువులతో కలిసి రైలులో ఉత్తరప్రదేశ్‌కు బయల్దేరి వెళ్లాడు.
Comments
Please login to add a commentAdd a comment