
● చెన్నూర్ నియోజకవర్గం.. కార్మిక, కర్షకుల సమ్మేళనం ● అసెంబ్లీ ఎన్నికల్లో మందమర్రి కీలకం
చెన్నూర్: మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గంగా పేరున్న చెన్నూర్‌లో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. చెన్నూర్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు ఉద్యమ చరిత్ర ఉంది. పట్టణానికి చెందిన సుడిగాల విశ్వనాధ సూరి సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేయగా కార్మిక నాయకునిగా పేరున్న కోదాటి రాజమల్లు, గడ్డం వెంకటస్వామి కార్మికుల సంక్షేమ కోసం పాటు పడ్డారు. మందమర్రికి చెందిన సోత్కు సంజీవరావు, బోడ జనార్దన్, నల్లాల ఓదెలు కార్మిక కుటుంబాల నుంచి వచ్చారు. గడ్డం వినోద్ వెంకటస్వామి వారసునిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. విద్యార్థి ఉద్యమ నాయకునిగా పేరున్న బాల్క సుమన్ 2014లో పెద్దపల్లి ఎంపీగా 2018లో చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పోరాటాల పురిటిగడ్డ
చెన్నూర్ నియోజకవర్గానికి పోరాటాల పురిటిగడ్డగా, కార్మిక, కర్షక క్షేత్రంగా పేరుంది. ఈ నియోజకవర్గానికి 1952 నుంచి 2018 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. చెన్నూర్ ఉమ్మడి నియోజకవర్గంలో 1952, 1957లలో ఎన్నికలు జరిగాయి. చెన్నూర్, లక్సెట్టిపేట, సిర్పూర్ ఉమ్మడి నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 1952లో విశ్వనాధ సూరి,1957లో గడ్డం వెంకటస్వామి
గెలుపొందారు.
సోషలిస్టు పార్టీ ఇలాఖాలో హస్తం పాగా...
చెన్నూర్ అసెంబ్లీ స్థానానికి 1952లో జరిగిన ఎన్నికల్లో చెన్నూర్ పట్టణానికి చెందిన సూడిగాలి విశ్వనాధ సూరి ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందాడు. 1957లో చెన్నూర్, లక్సెట్టిపేట ఉమ్మడి నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో చెన్నూర్ నుంచి గడ్డం వెంకటస్వామి పోటీచేసి విజయం సాధించాడు. ఆ తర్వాత 1962లో చెన్నూర్ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. 1962లో జరిగిన ఎన్నికల్లో కోదాటి రాజమల్లు సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1967, 1972లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోదాటి రాజమల్లు ఘన విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా సి.నారాయణ, 1983లో మందమర్రి పట్టణానికి చెందిన సోత్కు సంజీవరావు, సంజయ్ విచార్‌మంచ్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1985, 1989, 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన బోడ జనార్దన్ గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి పెద్ద కుమారుడు గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. ఆతర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్‌పై టీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికలతో పాటు 2014లో జరిగినసార్వత్రిక ఎన్నికల్లో నల్లాల ఓదెలు గెలుపొందారు.
పునర్విభజనలో తగ్గిన మండలాలు
2004లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అంతకుముందు చెన్నూర్ నియోజకవర్గంలో చెన్నూర్, మందమర్రి, జైపూర్ కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల మండలాలు ఉండేవి. కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గంలో నెన్నెల, వేమనపల్లి మండలాలు కలిశాయి. ప్రస్తుతం చెన్నూర్, మందమర్రి, జైపూర్, కోటపల్లి మండలాలు ఉండగా కొత్తగా ఏర్పడిన భీమారం 5 మండలాలతో కొనసాగుతోంది.
ఎన్నికల్లో మందమర్రే కీలకం
చెన్నూర్ నియోజకవర్గంలో చెన్నూర్, మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలు ఉన్నాయి. మందమర్రిలో కార్మిక ఓటర్లే అధికసంఖ్యలో ఉన్నారు. ఎన్నికల్లో కార్మికుల ఓట్లే కీలకం అవుతున్నాయి. నాలుగు మండలాల్లో 80 వేల ఓటర్లు ఉండగా ఒక్క మందమర్రిలోనే 75 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది వారే కావడంతో అభ్యర్థులు మందమర్రిలోనే ఎక్కువగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
ఎమ్మెల్యే పదవీ కాలం పార్టీ
సుడిగాల విశ్వనాధసూరి 1952–57 సోషలిస్టు పార్టీ
గడ్డం వెంకటస్వామి 1957–62 కాంగ్రెస్
కోదాటి రాజమల్లు 1962–77 కాంగ్రెస్
సి.నారాయణ 1978–83 కాంగ్రెస్
సోత్కు సంజీవరావు 1983–85 సంజయ్ విచార్‌మంచ్
బోడ జనార్దన్ 1985–2004 టీడీపీ
గడ్డం వినోద్ 2004–09 కాంగ్రెస్
నల్లాల ఓదెలు 2009–10 టీఆర్‌ఎస్
నల్లాల ఓదెలు 2010–14 టీఆర్‌ఎస్
నల్లాల ఓదెలు 2014–18 టీఆర్‌ఎస్
నియోజకవర్గ ఓటర్లు ఇలా..
మండలం పురుషులు సీ్త్రలు ట్రాన్స్‌జెండర్స్ మొత్తం
మందమర్రి 37,669 37,755 4 75,428
జైపూర్ 14,258 13,994 1 28,253
భీమారం 6,172 6,286 0 12,458
చెన్నూర్ 21,304 21,534 0 42,838
కోటపల్లి 12,566 12,572 2 25,140
మొత్తం 91,969 92,141 7 1,84,117


గడ్డం వెంకటస్వామి

బోడ జనార్దన్

గడ్డం వినోద్

సుడిగాల విశ్వనాధసూరి

నల్లాల ఓదెలు

సోత్కు సంజీవరావు

కోదాటి రాజమల్లు

బాల్క సుమన్
Comments
Please login to add a commentAdd a comment