
బాలలకు భరోసా
● ముగిసిన ‘ఆపరేషన్ స్మైల్’
● 57 మంది చిన్నారులకు విముక్తి
పెంచికల్‌పేట్(సిర్పూర్): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి బందీలుగా ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నెల రోజులుగా జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్– 11 కార్యక్రమం ముగిసింది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లలో ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక బృందాలు బాల కార్మికులకు స్థావరాలుగా ఉన్న వ్యాపార సముదాయాలు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, పారిశ్రామిక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించాయి. అధికారులు 57 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు బాలలను అప్పగించారు.
57 మంది చిన్నారుల గుర్తింపు..
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే నేతృత్వంలో పోలీసు అధికారులు, శిశుసంరక్షణ, కార్మిక, బాలల హక్కు ల పరిరక్షణ సమితి, విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో జనవరి 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆసిఫాబాద్ డివిజన్‌లోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తు న్న 21 మంది బాలకార్మికులను గుర్తించారు. అలా గే కాగజ్‌నగర్ డివిజన్‌లో 31 మంది బాలకార్మికులు, బడి మానేసిన వారు ఒకరు, బాల్యవివాహాలు ఒకరు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలను ముగ్గురిని గుర్తించారు. తల్లిదండ్రులు, యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి బందీలుగా ఉన్న చిన్నారులకు విముక్తి కల్పించారు.
తనిఖీలతో సత్ఫలితాలు..
జిల్లాలో ఏటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వివిధ కారణాలతో బాలకార్మికులుగా మారిన వారికి అధికారులు కొత్తదారి చూపుతున్నారు. గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ పదో విడత కార్యక్రమంలో మొత్తం 68 మంది చిన్నారులను గుర్తించారు. వీరిలో బాలకార్మికులు 59 మంది ఉండగా.. బాల్యవివాహం చేసుకున్న ముగ్గురు, బడిమానేసిన పిల్లలు ఆరుగురు ఉన్నారు.
భరోసా కల్పిస్తున్నాం
బాలలకు భరోసా కల్పించడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు బాలకార్మికులు, అనాథ పిల్లలకు విద్య, వైద్యం ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఆపదలో ఉన్న బాలబాలికల కోసం పోలీసు, రెవెన్యూ, శిశుసంక్షేమ, కార్మిక విభాగం అధికారులతో పాటు 1098 నంబర్‌లో సంప్రదిస్తే సాయం అందిస్తాం. బాలలను పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం.
– బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి
Comments
Please login to add a commentAdd a comment