
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
● 11రోజులంటూ అధికారుల ప్రకటన ● రైలు ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థితులు
బెల్లంపల్లి: దక్షిణ మధ్య రైల్వే అధికారుల నిర్ణయంతో రైలు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ చిన్న సమస్య తలెత్తినా, ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేస్తుండడం ఇటీవలి కాలంలో రైల్వే అధికారులకు పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. తాజాగా మరోసారి రైళ్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా రైళ్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్(రైలు నంబరు 17233, 17234)ను ఈ నెల 10నుంచి 20వరకు 11రోజులపాటు రద్దు చేస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలుతో లింక్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణం సాగించే రైలు ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తనున్నాయి. రైళ్ల పునరుద్ధరణ జరిగే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతం
సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సాధారణ రైల్వేస్టేషన్లలోనూ ఆగుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రయాణికుల రైలుగా పేరుంది. సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్–కాజిపేట జంక్షన్ మధ్య అతి సాధారణ రైల్వేస్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ కల్పించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు, పెద్దపల్లి, హన్మకొండ జిల్లా పరిధిలోని ప్రజలు, వ్యాపారులు, సింగరేణి కార్మికులు, విద్యార్థులు, హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఈ రైలును రోజుల తరబడి రద్దు చేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన వస్తుంది. ఈ నెలలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో దూర ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలుతో లింక్ లేకుండా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపించడానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సానుకూల నిర్ణయం తీసుకోవాలి
ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు, వ్యాపార వర్గాలు, విద్యార్థులు, ప్రత్యేకించి పేదలకు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ పనులు లేకపోయినా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలుతో ఉన్న లింక్‌ను దృష్టిలో పెట్టుకుని 11 రోజులపాటు రద్దు చేయడం సరికాదు. ఈ విషయంలో రైల్వే అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
– ఎన్.నగేశ్, బెల్లంపల్లి
30రైళ్లు..
కాజిపేట జంక్షన్–డోర్నకల్ జంక్షన్, డోర్నకల్ జంక్షన్–విజయవాడ, భద్రాచలం రోడ్–విజయవాడ మధ్య నడిచే దాదాపు 30 ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, ప్యాసింజర్ రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో డైలీ, వీక్లీ రైళ్లు ఉన్నాయి. రద్దయిన వాటిలో గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహనతోపాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఆయా మార్గాల్లో నడిచే రైళ్లన్నీ 11రోజులపాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని అధికారులు పేర్కొన్నారు. కాగా, మరో తొమ్మిది రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు. నాలుగు రైళ్లు 60 నుంచి 90 నిమిషాలు ఆలస్యంగా నిర్దేశించిన ప్రాంతాల నుంచి బయల్దేరనున్నట్లు వెల్లడించారు.

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
Comments
Please login to add a commentAdd a comment