
సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వద్దు
● సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా
దహెగాం/పెంచికల్‌పేట్/చింతలమానెపల్లి/కౌటాల/బెజ్జూర్: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. దహెగాం, పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల, బెజ్జూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. ఓటర్ల సంఖ్య, వసతుల వివరాలను తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు ఉండాలని ఆదేశించారు. నిర్వహణకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతుల కల్పనలో లోటుపాట్లు ఉండొద్దని సూచించారు. నిబంధనల ప్రకారం రాజ కీయ పార్టీల హోర్డింగులు, గోడలపై రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు కవిత, భూమేశ్వర్, ఎంపీడీవో అల్బర్ట్, ఎంఈవో జయరాజ్, డీటీ దౌలత్, ఆర్‌ఐలు నాందేవ్, సురేశ్, విజయ్, సీనియర్ అసిస్టెంట్లు జుగాదిరావు, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment