పన్నుల వసూళ్లు సగమే..
● జీపీల్లో రూ.5.62 కోట్లకుగానూ రూ.2.81 కోట్లు వసూలు ● 71 శాతంతో ఆసిఫాబాద్ ముందంజ ● 24 శాతంతో చివరిస్థానంలో జైనూర్
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 52 రోజుల గడువు మాత్రమే ఉంది. జిల్లాలో 335 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇంటి, కుళాయి పన్నులు రూ.5.62 కోట్లు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.2.81 కోట్లు (55 శాతం)మాత్రమే వసూలయ్యాయి. మార్చి 31 వరకు వందశాతం లక్ష్యం పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించారు. గతేడాది 90 శాతానికి పైగా పన్నులు వసూలు కాగా ఈసారి ఇప్పటి వరకు 55 శాతం కూడా దాటలేదు.
పెరిగిన పనిభారం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తోంది. ప్రభుత్వ పథకాలను అర్హులకు వర్తింపజేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉండే పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లతో సర్వేలు చేయిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు జాబ్‌చార్ట్‌తో పాటు సర్వేలు, ఇతరత్రా పనులు చేపట్టాల్సిరావడంతో పనిఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల ఉద్యోగ ఫలితాలు రావడంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఉన్న వారిపై పనిభారం పెరిగింది. మండలానికి రెండు మూడు కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండగా ఓపీఎస్‌లను నియమించుకున్నారు.
30 జీపీల్లో వందశాతం..
జిల్లాలోని 30 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు వందశాతం పన్నులు వసూలయ్యాయి. పెంచికల్‌పేట్, లింగాపూర్ మండలాలు మినహా మిగతా మండలాల్లో 3 నుండి 5 వరకు పంచాయతీల్లో వందశాతం పూర్తయింది. గత ఆర్థిక సంవత్సరంలో 181 పంచాయతీల్లో వందశాతం వసూలైంది. ఆసిఫాబాద్ మండలం 71శాతంతో మొదటి స్థానంలో ఉండగా, జైనూర్ మండలం 24 శాతంతో చివరి స్థానంలో ఉంది. జిల్లాకు నిర్దేశించిన ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం చేరుకోవాలంటే మరో 52 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.
లక్ష్యసాధనలో నిమగ్నం..
ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండడంతో అధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో కోడ్ వస్తే ఎన్నికల విధుల్లో బిజీగా మారే అవకాశం ఉన్నందువల్ల సాధ్యమైనంత త్వరగా లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకెళ్తున్నారు.
వందశాతం పూర్తి చేయడమే లక్ష్యం
జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నుల వసూళ్లను మార్చి 31లోగా పూర్తి చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలుకోసం సర్వే పనుల్లో పంచాయతీ కార్యదర్శులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక కార్యాచరణతో పన్నులు వసూలు చేస్తాం. గడువులోగా వందశాతం పూర్తి చేయడమే లక్ష్యం.
– భిక్షపతిగౌడ్,
జిల్లా పంచాయతీ అధికారి
మండలాల వారీగా పన్నుల వసూళ్ల వివరాలు
మండలం జీపీలు టార్గెట్ వసూలు శాతం
(రూ.ల్లో) (రూ.ల్లో)
ఆసిఫాబాద్ 27 37,29,808 26,61,193 71
చింతలమానెపల్లి 19 24,41,310 16,97,007 68
లింగాపూర్ 14 9,89,435 06,47,566 64
కాగజ్‌నగర్ 28 59,26,212 37,01,778 63
సిర్పూర్(యూ) 15 10,44,210 06,78,319 61
సిర్పూర్(టి) 16 4,60,621 22,76,080 55
దహెగాం 24 27,58,994 15,15,640 54
కెరమెరి 31 35,92,334 17,61,234 49
రెబ్బెన 24 74,73,586 38,13,583 48
కౌటాల 20 47,72,487 21,35,607 44
తిర్యాణి 29 28,87,505 11,60,448 40
వాంకిడి 28 91,42,163 37,24,544 39
పెంచికల్‌పేట్ 12 13,39,835 04,90,018 36
బెజ్జూర్ 22 32,42,209 11,00,770 32
జైనూర్ 26 27,32,440 06,78,316 24
మొత్తం 335 5,62,32,150 2,81,22,103 55
పన్నుల వసూళ్లు సగమే..
Comments
Please login to add a commentAdd a comment