హామీలు అమలు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్లకు గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి త్రివేణి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయాలని భావిస్తోందన్నారు. ఇందులో భాగంగానే నూతన జాతీయ విధానం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇది అమలైతే ఐసీడీఎస్‌లో అనేక మార్పులు జరుగుతాయన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణమాచారి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు వనిత, రాజేశ్వరి, అంజలి, మల్లేశ్వరి, షీలా, జయప్రద, జ్యోతి, జయ, తదితరులు పాల్గొన్నారు.