ఏఐ పాఠం.. ఆసక్తికరం
తప్పు చేస్తే చెబుతోంది
ఏఐ బోధన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 20 నిమిషాలు ఇట్టే గడిచిపోతున్నాయి. తప్పులు చేస్తే.. కంప్యూటర్ చెబుతోంది. చేసిన తప్పు రెండోసారి చేస్తలేను. తెలుగులో వాక్యాలు రాయగలుగుతున్నా.
– డి.రిషిత,
ఐదో తరగతి, గోయగాం ప్రాథమిక పాఠశాల
కొత్తగా అనిపిస్తుంది
కంప్యూటర్లతో నేర్చుకోవడం కొత్తగా అనిపిస్తుంది. అర్థమయ్యే రీతిలో ప్రశ్నలు ఉన్నాయి. త్వరగా అర్థం చేసుకుంటున్నాను. ప్రశ్నలకు జవాబు తప్పుగా రాస్తే మరో అవకాశం ఉంది. సులువుగా లెక్కలు ఎలా చేయాలనేది వివరిస్తోంది.
– అదె హర్శిత,
ఐదో తరగతి, ఖిరిడి ప్రాథమిక పాఠశాల
కెరమెరి(ఆసిఫాబాద్): నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ(అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) బోధనను ప్రారంభించింది. జిల్లాలో మొదటి విడతలో నాలుగు పాఠశాలల్లో తరగతులు మొదలయ్యాయి. ప్రతిరోజూ 20 నిమిషాలపాటు తెలుగు, గణితం బోధన కొనసాగుతుంది. గతంలో పోల్చుకుంటే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో మార్పు వచ్చిందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఏఐ పాఠాలపై ఎంతో ఆసక్తితో వింటున్నారని చెబుతున్నారు. సీ గ్రేడ్ విద్యార్థులు ఆసక్తిగా చదువు కొనసాగించేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్(ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ)అమలులో ఇది కీలకంగా మారింది. గతంలో గణితం ఇబ్బందిగా పడే వారు మెరుగయ్యారు. కూడికలు, తీసివేతలు చేయగలుగుతున్నారు. చిన్నచిన్న గుణకారాలు చేస్తున్నారు. గతంలో ఉపాధ్యాయులు బోర్డుపై చెప్పగా, ప్రస్తుతం రంగురంగుల బొమ్మలతో గణితం బోధన కొనసాగుతోంది. తెలుగులో సరళ, కఠిన పదాలు రాని వారు ప్రస్తుతం రాయడం, చదవడం చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులకు కీబోర్డు, మౌస్ అంటేనే తెలియదు. అలాంటి వారికి కంప్యూటర్, కీబోర్డు, మౌస్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. మూల్యాంకనం అనంతరం విద్యార్థి స్థాయిని నిర్ధారించి బోధన మెరుగుపరుస్తున్నారు. మొత్తం పది దశల్లో ఇప్పటికే విద్యార్థులు మూడు దశలకు చేరారు.
ప్రతీ పాఠశాలలో పది మంది..
చదువులో వెనుకబడిన విద్యార్థులకు కృత్రిమ మే ధా ద్వారా సులభ రీతిలో పాఠాలు బోధించేలా విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ తరగతులను ప్రవేశపెట్టింది. రెబ్బెన మండలంలోని తక్కెళ్లపల్లి ప్రాథమిక పాఠశాల, కెరమెరి మండలం గోయ గాం, వాంకిడి మండలం ఖిరిడి, బెజ్జూర్ మండలం సలుగుపల్లి ప్రైమరీ పాఠశాలలను ఎంపిక చేశారు. 3, 4, 5వ తరగతుల నుంచి పది మంది విద్యార్థులకు ఏఐ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీ విద్యార్థికి ప్రత్యేక యూజర్ ఐడీ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత 20 నిమిషాల పాటు ప్రశ్నలు, పాఠాలు ఉంటాయి. కృత్రిమ మేధా ద్వారా నిర్వహిస్తున్న తరగతులు సులభ రీతిలో పిల్లలు త్వరగా అర్థం చేసుకునేలా ఉన్నాయి. ముందుగా ప్రశ్నల సరళితో విద్యార్థుల సామార్థ్యాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా పాఠాలు బోధిస్తుంది. ఖిరిడి ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్లు లేకపోవడంతో పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్లను వాడుతున్నారు. అక్కడ ఐదింటిలో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మూడు కంప్యూటర్లు, ఒక స్కూల్ ట్యాబ్ ద్వారా 20 నిమిషాలకు నలుగురి చొప్పున తరగతులు నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల ప్రశ్నల సరళిని అర్థం చేసుకుంటున్నా పాఠాల బోధన ఆంగ్లంలో ఉండటంతో చిన్నారులు తికమక పడుతున్నారు.
ఒక్కో విద్యార్థికి 20 నిమిషాలపాటు తరగతులు
అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు దోహదం
జిల్లాలోని నాలుగు ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధాతో బోధన
సరిపడా కంప్యూటర్లు లేవు
గణిత బోధన పద్ధతులు సులభంగా అర్థం చేసుకునేలా ఉంటున్నాయి. కానీ పాఠాలు ఇంగ్లిష్‌లో బోధిస్తున్నాయి. సక్రమంగా అర్థం కావడం లేదు. తెలుగులో బోధిస్తే ఇంకా మేలు. త్వరగా అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్లు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
– అదె సంధ్య, ఐదో తరగతి, ఖిరిడి ప్రాథమిక పాఠశాల
విద్యార్థులకు ఉపయోగం
విధ్యార్థులు ఏఐ బోధనతో పాఠాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 20 నిమిషాలు ఉత్సాహంగా చతుర్విద ప్రక్రియలు చేయగలుగుతున్నారు. తెలుగు వాక్యాలు రాయగలుగుతున్నారు. ప్రస్తుతం మూడో దశకు చేరారు. కృత్రిమ మేథా విద్యార్థులకు ఎంతో ఉపయోగం.
– భరత్‌రావు, ఉపాధ్యాయుడు, గోయగాం
కంప్యూటర్ వినియోగంపై అవగాహన
ఏఐ తరగతులకు చదువులో వెనుకబడిన పది మంది విద్యార్థులను ఎంపిక చేశాం. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో ప్రతీ విద్యార్థికి 20 నిమిషాల చొప్పున తరగతులు ఉంటాయి. కంప్యూటర్ల ద్వారా తరగతులు, ప్రశ్నలు ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ వినియోగంపై కూడా వారికి అవగాహన వస్తుంది.
– శివరాజ్, ఉపాధ్యాయుడు, ఖిరిడి ప్రాథమిక పాఠశాల
ఏఐ పాఠం.. ఆసక్తికరం
ఏఐ పాఠం.. ఆసక్తికరం
ఏఐ పాఠం.. ఆసక్తికరం
ఏఐ పాఠం.. ఆసక్తికరం
ఏఐ పాఠం.. ఆసక్తికరం