
రాయితీపై యంత్ర పరికరాలు
● వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ ● 50 శాతం సబ్సిడీతో మహిళా రైతులకు పనిముట్లు ● నియోజకవర్గాల వారీగా నిధులు కేటాయింపు ● దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖ
ఏఈవో, ఏవోలను సంప్రదించాలి
వ్యవసాయ యాంత్రీ కరణ పథకంలో అర్హులైన రైతులకు రాయితీపై పరికరాలు అందజేస్తాం. సన్న, చిన్నకారు మహిళా రైతులు లబ్ధి పొందవచ్చు. క్లస్టర్ పరిధిలోని ఏఈవో, ఏవోలను సంప్రదించి దరఖాస్తులు అందజేయాలి. – శ్రీనివాసరావు,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ఆసిఫాబద్‌రూరల్: రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే పలు పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తుండగా.. తాజాగా వ్యవసాయ పనిముట్లను సై తం రాయితీపై మహిళా రైతులకు పంపిణీ చేయాల ని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సైతం మొదలైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.72లక్షలు మంజూరు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరిస్తున్నాయి.
దరఖాస్తుల స్వీకరణ షురూ
గతంలో వ్యవసాయశాఖ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై అనేక యంత్ర పరికరాలు పంపిణీ చేసింది. సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టారు. అయితే 2016– 17 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఈ పథకం నిలిచిపోయింది. అప్పటి నుంచి రైతులు యంత్ర పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు మళ్లీ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించింది. సన్న, చిన్నకారు, ఇతర వర్గాల మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్ చేస్తున్నారు. మండల, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన యంత్ర పరికరాలను రైతులకు సరఫరా చేస్తారు. సబ్సిడీ మొత్తాన్ని వ్యవసాయశాఖ సదరు కంపెనీలకు చెల్లించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా పరికరాలు, నిధులు కేటాయించారు.
తీవ్ర పోటీ
యంత్ర పరికరాల కోసం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే అర్హుల ఎంపిక జిల్లా వ్యవసాయశాఖకు కత్తి మీద సాములా మారనుంది. రాష్ట్రలో 2017 లోనే యాంత్రీకరణ పథకం ఆగిపోయింది. అప్పటి నుంచి రైతులు ప్రైవేట్‌లో యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు అద్దె ప్రతిపాదికన వినియోగించుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పథకాన్ని పునరుద్ధరించడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు జిల్లాలో పట్టా పాసు పుస్తకాలు ఉన్న రైతులు అతి తక్కువ మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, ఎక్కువగా పురుషులకే పట్టాలు ఉన్నాయి. రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
జిల్లా వివరాలు
పరికరాలు కేటాయించిన నిధులు
యూనిట్లు (రూ.లక్షల్లో)
ట్రాక్టర్లు 4 20
పవర్ టిల్లర్ 3 3
బ్రష్ కట్టర్లు 4 1.4
ఆపరేటెడ్ స్ప్రేయర్లు 92 0.92
పవర్ స్ప్రేయర్లు 92 8.28
రోటవేటర్లు 52 24.96
సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 8 2.4
డిస్క్ హ్యారో రోటో పడ్లర్ 5 10
బండ్ ఫార్మర్ 03 0.39
పవర్ వీడర్లు 2 0.7

రాయితీపై యంత్ర పరికరాలు