
పుట్టెడు దుఃఖంలో ‘పది’ పరీక్షకు..
దహెగాం: తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖం ఉన్నా ఆ బాధను దిగమింగుకుంది.. అల్లారుముద్దుగా పెంచిన నాన్న ఇక లేడని తెలిసినా ఆయన కష్టం వృథా కావొద్దని పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద ఘటన జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన మేకల రాజయ్య(40), సత్తక్క దంపతులకు కుమార్తె అనురాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనురాధ మండల కేంద్రంలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. రాజయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంగళవారం మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించగా, బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మృతిచెందాడు. అనురాధ తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం పరీక్షకు హాజరైంది. పరీక్ష పూర్తికాగానే కుటుంబీకులు విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లారు. తండ్రి మృతదేహాన్ని చూసి అనురాధ బోరున విలపించింది. స్వగ్రామంలో రాజయ్య అంత్యక్రియలు పూర్తిచేశారు.
కొనసాగుతున్న ‘పది’ పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన గణితం పరీక్షకు 36 కేంద్రాల్లో 6,521 మంది విద్యార్థులకు 6,498 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ తెలిపారు.